డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
మచిలీపట్నం:
భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించినప్పుడే సమాజంలో వివక్షత పూర్తిగా తొలగిపోతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు.
భారత మాజీ ఉపప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను మచిలీపట్నం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని మల్కాపట్నంలో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజకీయ చరిత్రలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఒక విశిష్టమైన స్థానం ఉందని అన్నారు. దేశంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిరంతరాయంగా లోక్‌సభ సభ్యుడిగా కొనసాగిన అరుదైన నాయకుడు ఆయన అని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుని, ఎన్నికల్లో ఓటమి చవిచూడకుండా అంత కాలం ప్రజాప్రతినిధిగా సేవలందించడం ఒక గొప్ప చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. అలాగే లేబర్ మినిస్టర్‌గా సేవలందించిన అనంతరం అంతర్జాతీయ కార్మిక సంస్థలో ఆసియా ఖండం నుంచి తొలి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించడం ఆయన ప్రతిభకు, దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. దేశానికి వ్యవసాయ, రైల్వే, రక్షణ శాఖల మంత్రిగా కీలక సేవలందించిన గొప్ప నాయకుడిగా ఆయనను గుర్తుచేశారు. సిద్ధాంతాలకు కట్టుబడి నడిచిన నాయకుడు బాబు జగజీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ కొనియాడారు. అత్యవసర పరిస్థితుల సమయంలోనూ తన విలువలను, నమ్మకాలను కాపాడుకుంటూ ప్రజల పక్షాన నిలిచిన ధైర్యవంతుడని పేర్కొన్నారు. అనంతరం తిరిగి ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు.
ప్రభుత్వం అందించే సబ్సిడీలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటే యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కూడా ఆర్థికంగా బలపడవచ్చని చెప్పారు. ప్రభుత్వం పీఎంఈజీపి, పీఎంఎఫ్ఎంఈ వంటి పథకాల ద్వారా ఉద్యమదారులకు 35 శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తోందని ఆయన వివరించారు. రూ.10 లక్షల రుణం తీసుకుంటే, అందులో కేవలం రూ.6.5 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాలను మరింత మంది వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి, జిల్లాలో 500 మంది ఉద్యమదారులను గుర్తించి వారికి రుణాలు, శిక్షణ, ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను అందరూ పుణికిపుచ్చుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
*జగ్జీవన్ రామ్ కు ‘భారతరత్న’ పురస్కారం ఇవ్వాలి : ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు*
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ మచిలీపట్నంతో విడదీయలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన ఒక భారీ సభకు బందరు నుంచి లారీల్లో తరలివెళ్లిన జనసందోహాన్ని గుర్తుచేస్తూ, ఆ సభకు హాజరైనంత మంది ప్రజలు మరే ఇతర సభకు రాలేదనిపించేంత స్థాయిలో ఆయనకు ప్రజాభిమానముందని అన్నారు. ప్రజల కష్టాలను తమవిగా భావించి సహాయం చేసే మానవతా దృక్పథం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని కొనియాడారు. అలాగే 1952 నుండి 1986 వరకు సుదీర్ఘకాలం పాటు ఎంపీగా సేవలందిస్తూ అపజయం ఎరుగని నాయకుడిగా చరిత్రలో నిలిచారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుని అంతకాలం నిరంతరాయంగా ప్రజాప్రతినిధిగా కొనసాగడం ఆయన అసామాన్య ప్రజాదరణకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మచిలీపట్నంలోని ‘ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ’ను కాపాడడంలో జగ్జీవన్ రామ్ పాత్ర ఎంతో కీలకమని గుర్తుచేశారు. ఒక దశలో ఆ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మూతపడే పరిస్థితి ఏర్పడటంతో, కార్మికులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లారని తెలిపారు. ఈ సమస్యపై ఉద్యమం సాగిన సమయంలో, జగ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా ఉండగా స్పందించి ఆ సంస్థను రక్షణ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి జాతీయం చేయించారని చెప్పారు.
ఆ నిర్ణయమే నేడు మచిలీపట్నంలోని ‘బెల్’ సంస్థగా రూపాంతరం చెంది దేశంలో కీలక పాత్ర పోషించడానికి కారణమైందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అన్నారు. మచిలీపట్నానికి ఆయన చేసిన గొప్ప ఉపకారాల్లో ఇది ఒకటని స్పష్టం చేశారు.
సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన అటువంటి గొప్ప నాయకుడికి ‘భారతరత్న’ పురస్కారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ ద్వారా సంబంధిత ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని చేరవేయాలని కోరారు.
చిన్నతనంలోనే ఎన్నో సామాజిక వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ, వాటిని ధైర్యంగా ఎదుర్కొని సమానత్వానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని ఆయన అన్నారు. ఒకప్పుడు మంచినీటి కుండల విషయంలో జరిగిన వివక్షకు నిరసనగా, స్వయంగా మూడు కుండల్లోని నీటిని కలిపి అందరూ తాగవచ్చని ధైర్యంగా ప్రకటించిన సంఘటన ఆయన సమానత్వ భావనకు అద్దం పడుతుందని తెలిపారు.
ప్రజల కోసం, కార్మికుల కోసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడిగా జగ్జీవన్ రామ్ చిరస్మరణీయులని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అన్నారు.
డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ నిరుపేదల పక్షపాతి, సామాజిక సమానత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశంలో నలిగిపోతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అని అన్నారు. పేదల కష్టాలను స్వయంగా అనుభవించి, వారి కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. చిన్ననాటి నుంచే వివక్షను, సామాజిక అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తి అని డిసిఎంఎస్ చైర్మన్ అన్నారు. పాఠశాల దశ నుంచే ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన తీరు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ స్టేట్ కోకన్వీనర్, హిందూ స్కౌట్స్ అసోసియేషన్ స్టేట్ కమిషనర్ మానికొండ శ్రీధర్, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, అర్బన్ బ్యాంకు వైస్ చైర్మన్ వంపుగడల చౌదరి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి విద్యాసాగర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు షేక్ షాహిద్ బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణి కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, నాయకులు, కొడాలి శర్మ, గడ్డం రాజు, లోగిశెట్టి స్వామి, బచ్చుల అనిల్, ఫిలిప్, పద్మ, నీరజ, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment