ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రజలకు సరైన అవగాహన కలిగించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై ప్రజలకు సరైన అవగాహన కలిగించాలని వారిలో సానుకూల దృక్పథం వ్యక్తమవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని మీకోసం సమావేశం మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన పై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం సేకరిస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో బాలింతలకు, గర్భవతులకు టేక్ హోమ్ రేషన్ పథకం కింద పోషకాహారం అందజేస్తుందన్నారు. ఈ విషయమై ప్రతి అంగన్వాడీ కార్యకర్త, లబ్ధిదారులకు వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన కలిగించాలన్నారు.
ఆర్టిజిఎస్ నుండి అభిప్రాయం సేకరించినప్పుడు వాస్తవ విషయాలు తెలియజేసే విధంగా వారిని చైతన్య పరచాలన్నారు.
అంగన్వాడీ కేంద్రం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తప్పనిసరిగా తెరిచి ఉంచాలని అక్కడికి వచ్చే వారికి తాగునీరు సౌకర్యం అందుబాటులో ఉండాలని, కోడిగుడ్డు, పాలు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలన్నారు. అంతేకాకుండా పాలు, గుడ్డు, బాలామృతం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు.
దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లను సంబంధిత వినియోగదారుల ఇంటి వద్ద పంపిణీ చేసే గ్యాస్ ఏజెన్సీ తరఫున ఉండే వ్యక్తుల ప్రవర్తన బాగుండాలని, మర్యాదపూర్వకంగా వినియోగదారులతో మాట్లాడాలని, నిర్ణీత ధర కంటే ఎక్కువగా పైకము వసూలు చేయరాదన్నారు. ధరల దుకాణంలో పంపిణీ చేసే బియ్యము వగైరా ఆహార వస్తువులు నాణ్యతగా ఉండాలన్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం చిక్కి కోడిగుడ్డు నాణ్యతగా ఉండాలన్నారు. ఏ ఆహార పదార్థాలు విద్యార్థులకు ఇస్తున్నారో వాటిపై వారి తల్లిదండ్రులకు సరిగా అవగాహన కలిగించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ తప్పనిసరిగా జరగాలన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులతో మర్యాదపూర్వకంగా సహాయ పూర్వకంగా మెలగాలన్నారు.
గ్రామ వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలన్నారు. అర్జీదారులకు సరిగా ఎండార్స్మెంట్ ఇచ్చినప్పటికీ అందుకు సంబంధించిన ఐచ్చికాన్ని ఎంపీక చేసుకోవడంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు సరైన వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల సంక్షేమమే చాలా ముఖ్యమని వారికి అందుబాటులో ఉన్న మందులను ఉచితంగా అందజేయాలన్నారు.
ప్రజలకు సేవలు అందించే ప్రతి ఒక్క ఉద్యోగి ఎవరైనా తప్పులు చేస్తుంటే వాటిని వెంటనే సరిదిద్దుకోవాలన్నారు.
రెవెన్యూ అంశాలకు సంబంధించి పరిష్కరించాలని. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ వ్యక్తికి నోటీసు ఇచ్చి విచారణ జరిపి ఆలస్యం చేయక వెంటనే నివేదిక ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, మీకోసం నోడల్ అధికారి విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, ఐ సి డి ఎస్ పిడి ఎంఎన్ రాణి, డీఎస్ఓ మోహన్ బాబు, డి ఎం హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ శేషు కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ జిల్లా సమన్వయకర్త రవికాంత్, విద్యాశాఖ ఏడి విద్యాలత, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిల శ్రీ, పలువురు సచివాలయ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, చౌక దుకాణాల డీలర్లు, ఎంఈఓ లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment