మచిలీపట్నం:
కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లు ఎంతో వేగంగా, సాఫీగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. అలాగే, ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురైనా, అవి ఎప్పుడూ భారంగా అనిపించలేదని ఆయన తెలిపారు. “ఇక్కడ సమస్యలు లేవని కాదు, సవాళ్లు ఎదుర్కోలేదని కాదు. చాలా కష్టపడి పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కానీ, ఏ రోజూ నాకు ఇది ఒక భారంలా అనిపించలేదు. ‘చేయలేం, వదిలేసి వెళ్ళిపోదాం’ అనే చిరాకు ఒక్క రోజు కూడా కలగలేదు” అని అన్నారు.
ఈ విజయానికి ప్రధాన కారణం జిల్లా అధికారులందరి సమిష్టి సహకారం, కట్టుబాటు, సమర్థవంతమైన విధి నిర్వహణేనని జిల్లా కలెక్టర్ అభిప్రాయపడ్డారు. “నేను ఏ ఆదేశం ఇచ్చినా, మీరు వాటిని వెంటనే అర్థం చేసుకుని అమలు చేయడం వల్లే ఈ రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేయగలిగాను. మీకేమైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే నాకు తెలియజేసేవారు. మీ నుంచి నాకు ఫోన్ రాలేదంటే పనులు సజావుగా సాగుతున్నాయని అర్థం చేసుకునేవాణ్ని. ఈ పరస్పర సహకారం వల్లే ఇది సాధ్యమైంది” అని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా జిల్లా అభివృద్ధి, ప్రజాసేవల దిశగా అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలో పరిపాలనను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు అధికారులందరి సహకారం అత్యంత అవసరమని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ రెండేళ్ల విజయవంతమైన పరిపాలనకు గుర్తింపుగా నిర్వహించిన ఈ సత్కార కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించి తమ అభినందనలు తెలియజేశారు.
*జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్ మాట్లాడుతూ..* జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. గతంలో ఇతర జిల్లాల్లో కూడా పనిచేసిన అనుభవం తనకు ఉన్నప్పటికీ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గారిలో కనిపించిన కొన్ని ప్రత్యేక లక్షణాలు ఎంతో భిన్నంగా, ప్రేరణాత్మకంగా అనిపించాయని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ప్రజల పట్ల, ఉద్యోగుల పట్ల ఆయన చూపించే మానవీయ దృక్పథం (ఎంపతి) ఎంతో విశేషమని జాయింట్ కలెక్టర్ తెలిపారు. సాధారణంగా ఉన్నతాధికారులు ఉద్యోగులను పేరు పెట్టి పిలవడం చాలా అరుదుగా జరుగుతుందని, అయితే జిల్లా కలెక్టర్ మాత్రం కొత్తగా చేరిన అధికారులనుంచి సీనియర్ అధికారుల వరకు అందరినీ వ్యక్తిగతంగా గుర్తుంచుకుని పేరు పెట్టి పిలవడం ఆయనలోని ప్రత్యేకత అని కొనియాడారు. అధికారులతో వ్యక్తిగత అనుబంధం, సాన్నిహిత్యం పెంచుకోవడంలో ఆయన చూపిన చొరవ అందరికీ ఆదర్శమని చెప్పారు. అలాగే, ప్రభుత్వ పరిపాలనలో సాధారణ విధుల నిర్వహణతో పాటు సొంత ఆలోచనలు, ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంలో జిల్లా కలెక్టర్ ముందుండేవారని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.
2014 తర్వాత సమాచార సాంకేతికత విస్తృతంగా పెరగడంతో, పై స్థాయి నుంచి వచ్చే ఆదేశాల అమలుకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని, అలాంటి పరిస్థితుల్లో కూడా స్వతంత్రంగా ఆలోచించి, ప్రతి శాఖలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయం అని జాయింట్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ ప్రతి శాఖలోనూ ఒక ప్రత్యేక దిశను నిర్దేశించి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు నడిపించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ వద్ద నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, అధికారులతో వ్యక్తిగత అనుబంధం పెంపొందించుకోవడం, ప్రభుత్వ స్థాయిలో నిరంతర ఫాలోఅప్ చేయడం వంటి అంశాల్లో ఆయన పనిచేసే తీరు ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. ముఖ్యంగా బిల్లులు, పరిపాలనా అనుమతులు, జీవోలను తీసుకురావడంలో ఆయన చూపిన పట్టుదల, కృషి అసాధారణమని తెలిపారు. ప్రత్యేకించి, సాధారణంగా క్లిష్టంగా భావించే ఎండోమెంట్ శాఖకు సంబంధించిన అంశాల్లో కూడా జిల్లా కలెక్టర్ సమర్థవంతమైన ఫాలోఅప్ ద్వారా పురోగతి సాధించగలిగారని, ఇది ఆయన పరిపాలనా నైపుణ్యానికి నిదర్శనమని జాయింట్ కలెక్టర్ అన్నారు.
కార్యక్రమంలో డిఆర్ఓ కె. చంద్రశేఖర రావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, బందరు ఇంచార్జ్ డీఎస్పీ ధర్మేంద్ర, ట్రైన్ డిప్యూటీ కలెక్టర్ నిఖిల, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారిణిలు ఎన్ పద్మావతి, జే జ్యోతి, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజు, జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, డీఎస్ఓ జి మోహన్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి సోమశేఖర్, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ఐసిడిఎస్, డ్వామా పీడీలు ఎన్ శివప్రసాద్ యాదవ్, ఎంఎన్ రాణి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment