జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై జిల్లా సమీక్షా మండలి సమావేశం - పాల్గొన్న జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్
మచిలీపట్నం :
జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశించారు.
బుధవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హిన్ జాహిద్ తో కలిసి జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించి అధికారులతో సమీక్షించారు. సమావేశంలో ప్రధానంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, జిల్లా నీటియాజమ్య సంస్థ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, వ్యవసాయం, రహదారులు భవనాలు తదితర శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులు, సమస్యలు చర్చించారు.
సమావేశంలో గుడివాడ, పామర్రు నియోజకవర్గాల శాసన సభ్యులు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి వారి నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాలని మంత్రులు, అధికారులను కోరారు.
సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, శాఖల వారీ పురోగతి అంశాలపై మంత్రి సమీక్షించారు. ప్రతి శాఖ తమ లక్ష్యాలను సమయానికి పూర్తి చేయడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని, అందుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో అధికారులు జవాబుదారీతనంతో, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం జనాభా 58 శాతం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 46 శాతం వనరులు మాత్రమే దక్కాయని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణకు ఎక్కువ లబ్ధి చేకూరగా, ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో వెనుకబడిందన్నారు. రాష్ట్రానికి సుమారు రూ.3.28 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ, అందులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, పన్నులు, ఇతర వనరులు ప్రధానంగా జీతాలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాలు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని ప్రజలు భావిస్తారని, అయితే అందుకు అవసరమైన వనరులు ఎక్కడి నుంచి వస్తాయో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పులు చేయడం లేదా ఆస్తులు అమ్మడం వంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే రాష్ట్ర వనరులను పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమన్నారు.
దక్షిణ భారతదేశంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని, తెలంగాణలో అది సుమారు రూ.3.84 లక్షలు ఉండగా, మన రాష్ట్రం ఇంకా ఆ స్థాయికి చేరాల్సి ఉందన్నారు. జిల్లాలో కూడా అభివృద్ధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయని, వాటిని సమర్థంగా వినియోగించుకుంటే తలసరి ఆదాయాన్ని మరింత పెంచవచ్చన్నారు.
జిల్లాలో ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, హార్టికల్చర్, పామాయిల్ తోటలు వంటి రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. పోర్టు ఏర్పాటుతో పరిశ్రమల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని, దీనివల్ల ఉపాధి, ఆదాయం, స్థూల ఆర్థికాభివృద్ధి పెరుగుతాయని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్లు, పోలీసులు, గ్రూప్-2 పరీక్షల ద్వారా దాదాపు 30 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, ప్రైవేట్ రంగంలో కూడా సుమారు 6 లక్షల ఉద్యోగాలు కల్పించగలిగామని, మొత్తం 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు.
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వంటి కార్యక్రమాలకు సంవత్సరానికి సుమారు రూ.35 వేల కోట్లు, తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలకు రూ.15 వేలు చొప్పున అందించేందుకు సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, చేనేత కార్మికులకు 200, 500 యూనిట్ల ఉచిత విద్యుత్, మత్స్యకార భరోసా వంటి పథకాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలన్నీ ప్రజలకు పక్కాగా, పారదర్శకంగా, అర్హులందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
జిల్లా సమీక్షా మండలి సమావేశాల్లో కొన్ని శాఖల పనితీరు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని, కొంత నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు మరింత చురుకుదనం ప్రదర్శించి, క్షేత్రస్థాయిలో సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.
వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడా నీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ఆర్డబ్ల్యూఎస్, ఇతర సంబంధిత విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే మోటార్లు, జనరేటర్లు వినియోగించి ట్యాంకులు నింపే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఇరిగేషన్ శాఖ డ్రైనేజీలలో పూడిక తీత, నిర్వహణ పనులు, రహదారులు భవనాలు శాఖ రోడ్ల పనులు, పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ మౌలిక వసతుల పనులు ఈ రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. మే, జూన్ నెలల తర్వాత వర్షాకాలం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, ఈ వేసవిలోనే పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఏప్రిల్ 15 నుండి వేట నిషేధ కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మే నెలలో మత్స్యకార భరోసా పథకం అమలవుతుందని తెలిపారు. అలాగే పోర్టు పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ టి జి ఎస్ వ్యవస్థ ద్వారా 50కి పైగా శాఖల పనితీరు, ప్రజల సంతృప్తి స్థాయిని పర్యవేక్షిస్తున్నారని, ప్రజల అభిప్రాయాల ఆధారంగా అధికారుల పనితీరును అంచనా వేస్తున్నారని మంత్రి తెలిపారు. కాబట్టి అధికారులు ప్రజా సేవలను మరింత మెరుగుపరచి, జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 2026–27 అవుట్ రీచ్ ప్రోగ్రాంను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..* రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లాకు సూపర్ సిక్స్ పథకాల కింద, అలాగే శాఖల వారీగా కేటాయించిన బడ్జెట్‌ను సమర్థవంతంగా వినియోగించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. జిల్లాకు వచ్చిన ప్రతి రూపాయి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా, అలాగే ప్రతి శాఖకు కేటాయించిన నిధులు లక్ష్యానికి అనుగుణంగా వినియోగించేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 2,28,168 మంది లబ్ధిదారులు ఉన్నారని, గత ఏడాది రూ.1,191 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.1,225 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద జిల్లాలో 1,91,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, గత ఏడాది రూ.242 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.295 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకానికి గత ఏడాది రూ.182 కోట్లు, ఈ ఏడాది రూ.186 కోట్లు, దీపం పథకంకు గత ఏడాది రూ.86 కోట్లు, ఈ ఏడాది రూ.94 కోట్లు, స్త్రీ శక్తి పథకానికి గత ఏడాది రూ.40.98 కోట్లు, ఈ ఏడాది రూ.56 కోట్లు కేటాయించారని తెలిపారు.
అలాగే మత్స్యకార భరోసా పథకానికి గత ఏడాది రూ.25 కోట్లు, ఈ ఏడాది రూ.26 కోట్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గత ఏడాది రూ.16 కోట్లు, ఈ ఏడాది రూ.17 కోట్లు కేటాయించబడినట్లు వివరించారు.
శాఖల వారీగా చూస్తే, కృష్ణా జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అత్యధికంగా రూ.526 కోట్లు కేటాయించగా, ఆ తర్వాత ఆరోగ్య శాఖకు రూ.344 కోట్లు, మహిళా శిశు అభివృద్ధి శాఖకు రూ.161 కోట్లు, విద్యాశాఖకు రూ.119 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.74 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.53 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.36 కోట్లు, హార్టికల్చర్ శాఖకు రూ.16 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ వివరించారు.
జిల్లా స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు సమగ్రంగా ఉన్నప్పటికీ, ప్రతి నియోజకవర్గం, ప్రతి శాఖ వారీగా కూడా వాటిని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతి శాఖ తమ పరిధిలో ఉన్న ప్రతి పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించబడిందో తెలుసుకుని, ఆ మేరకు అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.
కొన్ని శాఖల్లో సాధారణంగా మార్చి నెలలో బడ్జెట్ విడుదలైన తర్వాతే ఖర్చు చేయాలనే ధోరణి కనిపిస్తోందని, ఇది సమర్థవంతమైన విధానం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటే, నిధుల వినియోగం సక్రమంగా, సమయానికి, ఫలితాల ఆధారంగా అమలు చేయవచ్చన్నారు. ప్రతి శాఖ బడ్జెట్ వినియోగంలో పారదర్శకత, వేగం, లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని, జిల్లాకు కేటాయించిన ప్రతి రూపాయి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సిపిఓ ఎస్ ఉమాదేవి, డ్వామా, ఐసిడిఎస్ పీడీలు ఎన్ శివ ప్రసాద్ యాదవ్, ఎంఎన్ రాణి, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజ, పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నర్సింహులు, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణ రావు, గృహ నిర్మాణ సంస్థ పిడి వెంకట్రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ సోమశేఖర్, రహదారులు భవనాలు శాఖ ఈఈ లోకేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్ పద్మావతి, డీఎస్ఓ మోహన్ రావు, డిఈఓ యు వి సుబ్బారావు, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర బాబు, సోషల్ వెల్ఫేర్ డిడి షేక్ షాహిద్ బాబు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment