మచిలీపట్నం:
రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం మచిలీపట్నం నగరంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఉదయం 11 గంటలైనా కొంత మంది సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను వస్తున్నానని తెలిసి కూడా సీట్లు ఖాళీగా ఉండటం ఏమిటి?" అని అధికారులను ప్రశ్నించారు. గైర్హాజరైన వారి పేర్లను నోట్ చేసి, రిజిస్టర్లను తనిఖీ చేయాలని కమిషనర్ ను ఆదేశించారు.
ఈ క్రమంలో మంత్రి కార్యాలయంలోని పన్ను వసూళ్ల వివరాలను మంత్రి ఆరా తీశారు. ఈ ఏడాది రూ.39 కోట్ల టార్గెట్ కు గాను కేవలం రూ.16 కోట్లు (41%) మాత్రమే వసూలు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పన్ను వసూళ్లను ఎలా మెరుగుపరచాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
సచివాలయాల పనితీరును పరిశీలిస్తూ, సిబ్బంది కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని 50 సచివాలయాలకు గాను 10 చోట్ల అడ్మిన్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు సేవలు అందడంలో జాప్యం జరుగుతోందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో మచిలీపట్నం 40వ ర్యాంకులో ఉండటంపై చర్చించారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మన నగరం అగ్రస్థానంలో ఉండేలా సిబ్బంది క్షేత్రస్థాయిలో కష్టపడాలని పిలుపునిచ్చారు.
కార్యాలయానికి రాని అధికారులు, సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
మంత్రి వెంట నగర కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, పలువురు మాజీ కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment