త్రాగునీరు, సాగునీటి అవసరాలక నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలి : రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర
మచిలీపట్నం :
నీటిని భద్రపరచుకొని రాబోయే రోజుల్లో త్రాగునీరు, సాగునీటి అవసరాలకు పొదుపుగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత సాగునీటి సంఘాలు, ప్రజలపై ఉందని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి మచిలీపట్నం మండలంలోని పొట్లపాలెం గ్రామపంచాయతీలోని కొత్తపూడి గ్రామంలోనీ చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రివర్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో ప్రారంభించారన్నారు. ప్రతి వర్షపు నీటి బొట్టును వృధా కాకుండా చెరువుల్లో నింపుకొని పొదుపుగా సాగునీటికి, తాగునీటికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇందుకోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని చెరువులను గుర్తించి అందులో పూడిక తీత పనులను చేపట్టాలన్నారు.
అంతేకాకుండా రైతులు సాగునీటి సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారికి సంపూర్ణ అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కృష్ణా, గోదావరి, తుంగభద్ర ఆనకట్టలు వాటి దిగువన ఉన్న పెద్దపెద్ద కాలువలు అన్నీ కూడా నీటి ప్రవాహం సజావుగా జరిగేలా శివారు ప్రాంతాలకు సాగునీరు అందేలా వాటిల్లోని పూడికను తొలగించాలన్నారు.
ఆ విధంగా తమ ప్రభుత్వం వచ్చాక దాదాపు 640 టీఎంసీల నీటిని పెంచుకోగలిగేమన్నారు. గతంలో భూగర్భ జలాల మట్టం సరాసరి 10.62 మీటర్లు కాగా నేడు 8.70 మీటర్లకు వచ్చిందన్నారు.
ప్రస్తుతం చేపడుతున్న కొత్తపూడి గ్రామంలో 5 ఎకరాల్లో చెరువు ఉందని ఇందులో పూడిక తీసి నీటిని నింపుకుంటే భూగర్భ జలాలు బాగా పెరుగుతాయన్నారు. రాష్ట్రం మొత్తం సాగునీటికి 890 టీఎంసీలు, పరిశ్రమలకు 28 టీఎంసీలు, తాగునీటికి 150 టిఎంసిలు మొత్తం 1270 టీఎంసీలు నీరు అవసరం ఉందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నదులను అనుసంధానం చేయడానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ఈ ప్రాంతంలో 3 లక్షల మంది శ్రామికులకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. 165 కోట్ల రూపాయల మేరకు ఉపాధి పనులు జరిగాయన్నారు. అందులో 108 కోట్ల రూపాయలు సిమెంటు తదితర మెటీరియల్ కంపోనెంట్ కింద ఖర్చు చేయడం జరిగిందన్నారు.
వేసవి కాలంలో ఉపాధి పనులకు వచ్చే శ్రామికులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీరు ఓఆర్ఎస్ మేడ వంటి ప్రాథమిక చికిత్స కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ ప్రాంతంలో రహదారులు నిర్మించామని, ఉన్నాయని త్వరలో మురికి కాలువల నిర్మాణం కూడా చేపడతామన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ప్రకృతిలో మనకు కొన్ని నెలలు మాత్రమే వర్షాలు కురిసి నీరు వస్తుందని వాటిని దాచుకొని అవసరాన్ని బట్టి పొదుపుగా వినియోగించుకోవాలన్నారు.
చెరువుల్లో నీటిని నింపుకోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాల మట్టం పెరుగుతుందన్నారు.
చెరువుల్లో కూడిక తీయకపోవడంతో వర్షపు నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోయి భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయన్నారు. చెరువుల్లో పుష్కలంగా నీరు ఉంటే మనుషులకు, పశువులకు తాగడానికి అందరికీ ధైర్యంగా ఉంటుందన్నారు. చెరువుల్లో పూడిక తీసే కార్యక్రమాన్ని 100 రోజులపాటు చేపట్టనున్నామన్నారు.
మొదట 10 రోజులు పూడికలు తీయవలసిన చెరువులను గుర్తించాలన్నారు. గుర్తించిన చెరువుల్లో పూడిక తీసే పనుల ద్వారా శ్రామికులకు ఉపాధి లభించి ఆదాయం కూడా వస్తుందన్నారు.
పంట కాలువల్లో కూడా మట్టి పేరుకుపోయి నీరు సరిగా ప్రవహించక శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితి ఉందన్నారు. అందువలన పంట కాలువల్లో కూడా పూడిక తీసే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. చెరువుల్లో నీటిని నింపుకోవడం వల్ల బోరు బావుల్లో కూడా భూగర్భ జలాలు పెరుగుతున్నాయన్నారు.
సాగునీటి సంఘాల ప్రతినిధులు రైతులు కూర్చొని సంవత్సరం పొడుగునా సాగునీరు ఉండే విధంగా ఏం చేస్తే బాగుంటుందో పనులను గుర్తించి జాబితా తయారు చేయాలన్నారు. ఇదే విధానంలో అన్నమయ్య జిల్లాలో అమలుపరిస్తే మంచి ఫలితాలు వచ్చాయని దీంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల ఈ పద్ధతిని అనుసరించాలని సూచించిందన్నారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని నీటిని నిలువ చేసుకొని శుద్ధిచేసి పొదుపుగా ప్రతి ఇంటికి సరఫరా చేయాలన్నారు. పంట కాలువల ద్వారా శివారు ప్రాంతాలకు కూడా సాగునీరు అందించే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం కొత్తగా అంచనాలు రూపొందించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందు కోసం ఉపరితల జలాశయాల ద్వారా అన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేయవలసి ఉందన్నారు
ఈ కార్యక్రమంలో డ్వామా వీడి శివప్రసాద్, జలవనరుల శాఖ ఎస్ఇ గుణకర్, భూగర్భ జల శాఖ డిడి బిందు శ్రీ, జలవనరుల శాఖ ఈ ఈ రవికిరణ్, డి ఈఈ అపర్ణ,, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ సుధాకర్, ఏఈ సుగుణ, తహసిల్దారు నాగభూషణం, డిప్యూటీ ఎంపీడీవో బాలకృష్ణ రావు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ జిల్లా నీటి సంఘాల అధ్యక్షులు దేవన బోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ గణేష్, గూడూరు డిసి చైర్మన్ పోతన స్వామి, బందరు డిసి చైర్మన్ తూమాటి వెంకయ్య, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, స్థానిక నాయకులు లంకే శేషగిరిరావు పలువురు రైతు సంఘాల నాయకులు, రైతులు గ్రామస్తులు, శ్రామికులు పాల్గొన్నారు.
Comments
Post a Comment