Skip to main content

ఆర్&బీ, పబ్లిక్ హెల్త్, డ్రైనేజీ, మున్సిపల్ అధికారులు ఉమ్మడిగా మీడియా సమావేశం

అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం తగదు
నిబంధనల మేరకే పోర్టు రోడ్డులో డ్రైన్ డైవర్షన్ పనులు
సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై అధికారుల వివరణ
జాయింట్ ప్రెస్ మీట్ పెట్టిన పబ్లిక్ హెల్త్, ఆర్&బీ, డ్రైనేజీ అధికారులు
ఎస్టీపీలకు మురుగు నీటిని అనుసంధానించడానికే కల్వర్టు పనులు - పబ్లిక్ హెల్త్ ఈఈ
పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం - ఆర్&బీ ఈఈ
కల్వర్టు పనుల వల్ల డ్రైన్ లెవల్స్ కు ఇబ్బంది ఉండదు - డ్రైనేజీ డీఈ

మచిలీపట్నం

మచిలీపట్నం ముంపు నీటి సమస్య పరిష్కారానికి గాను స్థానిక బందరుకోట రోడ్డులో చేపట్టిన డ్రైన్ డైవర్షన్ పనులపై వివిధ ప్రసార మాధ్యమాలలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని సంబంధిత శాఖల అధికారులు తీవ్రంగా ఖండించారు. నిబంధనల మేరకు పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు. 

సోమవారం సాయంత్రం నగరంలోని ఆర్&బీ ఈఈ కార్యాలయంలో ఆర్&బీ, పబ్లిక్ హెల్త్, డ్రైనేజీ, మున్సిపల్ అధికారులు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజేశారు. 

పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రవీణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నం వచ్చిన సమయంలో నగరంలో డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఈ మేరకు రూ.197.3 కోట్లతో ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదించగా ఇటీవల రూ.13.02 కోట్లు నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఈ నిధులతో గత ప్రభుత్వంలో అనుసంధానించకుండా
అసంపూర్తిగా వదిలేసిన డ్రైన్ ల పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. నగరంలో గుర్తించిన 122 చోట్ల గ్యాప్ లను రూ.13కోట్లతో పూర్తి చేసేందుకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశామన్నారు. త్వరలోనే పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. అమృత్ 2.0లో నగరంలో రెండు మురుగు నీటి శుద్ధి ఫ్లాంట్ (ఎస్టీపీ)లు నగరానికి మంజూరు అయ్యాయని తెలిపారు. వాటిని నిర్మించేందుకు కరగ్రహారం వద్ద స్థల కేటాయింపులు జరిగాయన్నారు. సబ్ జైల్ అవుట్ ఫాల్ డ్రైన్, ఫత్తుల్లాబాద్ అవుట్ పాల్ డ్రైన్ల నుంచి మురుగు నీటిని పంపింగ్ చేసి ఎస్టీపీల వరకు మళ్లించడం జరుగుతుందన్నారు. దీని వల్ల నగరంలో డ్రైనేజీ సమస్యకు కూడా పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం ఏర్పడగలదన్నారు. 

ఆర్&బీ ఈఈ లోకేశ్వరరావు మాట్లాడుతూ పోర్టు రోడ్డులో రైల్వే గేటు దాటిన తర్వాత తమ శాఖ పర్యవేక్షణలో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు లేకుండా పనులు జరుగుతున్నాయని ఇటీవల ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిథులు తనను కలవడం జరిగిందన్నారు. అయితే డివిజన్ స్థాయిలో జరుగుతున్న పనులు కాబట్టి తమ శాఖ డీఈ, ఎఈలతో మాట్లాడి తెలియజేస్తామని వారికి తెలిపానన్నారు. అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నట్టు తాను చెప్పినట్టు వీడియోలను ఎడిట్ చేసి వివిధ మాధ్యమాల్లో ప్రసారం చేయడం సరైన విధానం కాదన్నారు. ఇది కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడమే అని అన్నారు. కల్వర్టు నిర్మాణ పనులను తాను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతోపాటు సంబంధిత అధికారులతో సమీక్షించామన్నారు. నగర ముంపు సమస్య పరిష్కారానికి గాను అత్యవసర పనిగా ఈ పనులు చేపట్టడం జరిగిందన్నారు. పనులపై తమ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని అనుభవం కలిగిన రిజిస్టర్డ్ కాంట్రాక్టరే ఈ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపడుతున్నారన్నారు. అత్యవసర పనులు ప్రభుత్వం నుండి అనుమతులు రాకముందే చేపట్టే అవకాశం ఉందన్నారు. దానిలో భాగంగానే కల్వర్టు నిర్మాణ పనులతోపాటు మరో పది రకాల పనుల అనుమతులకు 2025 జులై నెలలో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. అయితే ఆ పనులకు అనుమతులు రాకపోవటంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు ఆ ప్రాంత రైతుల అవసరాన్ని పరిగణలోకి చేసుకుని మళ్లీ 2026 మార్చిలో ప్రత్యేకంగా కల్వర్టు నిర్మాణ పనుల అనుమతులకు ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలిపారు. పనులకు అనుమతులు తీసుకువచ్చే విషయమై మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం నుండి అనుమతులు వస్తాయన్నారు. 

డ్రైనేజీ ఈఈ కిరణ్ బాబు మాట్లాడుతూ బందరుకోట రోడ్డు వెంబడి వెళుతున్న నార్త్ సైడ్, సౌత్ సైడ్ డ్రైన్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఒకే విధంగా రెండింటి బెడ్ లెవల్స్ ఉండటం వల్ల పరిసర ప్రాంతాలకు ఎటువంటి ముంపు సమస్య ఉత్పన్నం కాదన్నారు. ఈ పనులను తాము ఎప్పటికప్పుడు క్షేత్ర పరిశీలన చేస్తున్నామన్నారు. కల్వర్టు నిర్మాణం ద్వారా వర్షాకాలంలో నగరంలో నిలిచే ముంపు నీరంతా ఈ కల్వర్టు గుండా డైవర్ట్ అయి మెడికల్ కాలేజ్ వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీలోకి కలుస్తుందన్నారు. దీనివల్ల నగరంలో ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆర్&బీ డీఈ సంగీత, మున్సిపల్ డీఈ వెంకటేశ్వరరావు, డ్రైనేజీ జేఈ నజీమా రాణి పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...