Skip to main content

కరగ్రహారం హౌసింగ్ లేఔట్ అభివృద్ధికి చర్యలు: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం :

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హౌసింగ్ స్కీమ్ కింద కరగ్రహారం ప్రాంతంలో చేపట్టిన నివేశన స్థలాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, లబ్ధిదారులందరికీ అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం మండలం కరగ్రహారం పంచాయతీలోని హౌసింగ్ లేఔట్‌ను మంత్రి సందర్శించి, నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మాణాలు పూర్తి చేసుకున్న కొంతమంది లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గృహ నిర్మాణం, విద్యుత్, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లబ్ధిదారుల గుర్తింపు, ప్లాటింగ్, మౌలిక వసతుల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని పేర్కొన్నారు. ప్రాంతంలో మట్టి పనుల్లో అవకతవకలు జరిగాయని, తక్కువ మట్టి తోలించి అధిక బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని తెలిపారు.

కరగ్రహారం లేఔట్ లో మొత్తం 15,998 గృహాలలో కేవలం 804 గృహాలే పూర్తయ్యాయని, 5-6 శాతం కూడా పూర్తి కాలేదని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా డి-బ్లాక్‌లో 927 ప్లాట్లకు గాను కేవలం 74 గృహాలు మాత్రమే పూర్తి అయ్యాయని, అందులో కూడా కేవలం 16 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయని తెలిపారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కూడా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్ లబ్ధిదారులకు మరింత సహాయం అందిస్తున్నామని తెలిపారు. గతంలో రూ.1.80 లక్షలు మాత్రమే ఇచ్చిన గృహ నిర్మాణ సహాయాన్ని ఇప్పుడు పెంచి, ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు అదనంగా ఇస్తున్నామని చెప్పారు. దీంతో మొత్తం సహాయం రూ.2.30 లక్షలు (ఎస్సీ/బీసీ), రూ.2.55 లక్షలు (ఎస్టీ) వరకు లభిస్తుందని తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణం ప్రారంభించిన 2,443 గృహాలను సెప్టెంబర్‌లోపు పూర్తి చేస్తే ఈ పెరిగిన ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉందన్నారు. అలాగే స్పందించని కారణంగా డిసేబుల్ అయిన 9,848 గృహాలను మళ్లీ అర్హత జాబితాలోకి తీసుకువచ్చి, కొత్త స్కీమ్ కింద ప్రయోజనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కరగ్రహారం లేఔట్‌లో రహదారులు, తాగునీరు, విద్యుత్, లైటింగ్ వంటి మౌలిక వసతులను దశలవారీగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సమీకరించి పనులు చేపడుతున్నామని చెప్పారు. సచివాలయ ఎమెనిటీ సెక్రటరీల ద్వారా డివిజన్ల వారీగా లబ్ధిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఒక ఏడాది లోపు అన్ని గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకట్రావు, డిఇ బుజ్జిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి విద్యాసాగర్, మచిలీపట్నం నార్త్ మండలం తహసిల్దార్ నాగభూషణం, ఎంపీడీవో బాలకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మెండు సుగుణ కుమారి, పంచాయతీరాజ్ ఏఈ హరిబాబు, కూటమి నాయకులు వాలిశెట్టి తిరుమలరావు, రామగాని రత్నాకర్, వెంకటేశ్వరరావు, సోమశేఖర్, మధు తదితర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...