Skip to main content

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహా భారతం ఆరవ వేదం.....

        స్త్రీలు స్వయం కృషితో విజయ శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఉన్నత స్థానాల్లో కీర్తింప బడుతున్నారు. తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నారు. సైనికులుగా, టీచర్లుగా, డాక్టర్లుగా, న్యాయమూర్తులుగా, ప్రధాన మంత్రులుగా, రాష్ట్రపతులుగా అత్యున్నత స్థానాల్లో తమ సత్తా చాటుతున్నారు. 
      కానీ వృత్తి ధర్మంలో ఎన్నో ఆటుపోట్లకు ఎదురొడ్డి ...  ముందుకు నడిచే క్రమంలో స్త్రీ పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా స్త్రీ పని ప్రదేశంలో పురుషుల వల్ల శారీరక, మానసిక హింసకు గురవుతుంది. అలాంటి హింసకు వ్యతిరేకంగా ఒక స్త్రీ మూర్తి చేసిన పోరాటాన్ని ఈ మహిళా దినోత్సవం రోజు కీర్తిస్తూ....
          భారతదేశంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం(పోష్ యాక్ట్) రావడానికి వెనుక రాజస్థాన్‌కు చెందిన భన్వరీ దేవి సాహసోపేతమైన పోరాటం, విషాదకరమైన సంఘటన ఉన్నాయి. 
        రాజస్థాన్‌కు చెందిన భన్వరీ దేవి  చేసిన పోరాటమే నేడు భారతదేశంలోని పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించే 'విశాఖ మార్గదర్శకాలు', 'పోష్ చట్టం' రావడానికి ప్రధాన కారణం.
నేపధ్యం        
      రాజస్థాన్‌లోని భతేరి గ్రామంలో భన్వరీ దేవి ప్రభుత్వ 'సాతిన్' (సోషల్ వర్కర్) గా పనిచేసేవారు. మహిళల హక్కులు, శిశు సంక్షేమం, సామాజిక మార్పు కోసం ఆమె కృషి చేసేవారు. ప్రభుత్వం చేపట్టిన 'మహిళా వికాస్ కార్యక్రమం'లో భాగంగా ఆమె గ్రామాల్లో అవగాహన కల్పించేవారు.
        1992లో అక్షయ తృతీయ సందర్భంగా రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఒక పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన తొమ్మిది నెలల చిన్నారికి వివాహం చేయాలని ఆ కుటుంబం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భన్వరీ దేవి పోలీసులు, అధికారుల సహాయంతో ఆ పెళ్లిని ఆపగలిగారు.
         తమ ఇంటి శుభకార్యాన్ని అడ్డుకుందన్న కోపంతో.... ఆ గ్రామ పెద్దలు, వారి అనుచరులు భన్వరీ దేవిపై కక్ష గట్టారు. 1992 సెప్టెంబర్ 22న, ఆమె తన భర్తతో కలిసి పొలం నుండి తిరిగి వస్తుండగా, ఐదుగురు వ్యక్తులు ఆమె భర్తను కొట్టి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
          తనకు జరిగిన అన్యాయంపై భన్వరీ దేవి మౌనంగా ఉండకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అక్కడ ఆమెకు ఎదురుదెబ్బలే తగిలాయి. పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. వైద్య పరీక్షలు ఆలస్యంగా చేశారు. స్థానిక కోర్టు "ఉన్నత కులానికి చెందిన వారు తక్కువ కులపు మహిళను తాకరు" అనే వింత తర్కంతో నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టింది.
             భన్వరీ దేవికి జరిగిన అన్యాయాన్ని చూసి దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు ఏకమయ్యాయి. 'విశాఖ' అనే పేరుతో ఐదు మహిళా స్వచ్ఛంద సంస్థలు కలిసి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్ ) దాఖలు చేశాయి. పని చేసే చోట మహిళలకు రక్షణ లేకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని వారు వాదించారు.
విశాఖ మార్గదర్శకాలు (1997)
        భన్వరీ దేవి కేసు వల్ల సుప్రీంకోర్టు 1997లో ఇచ్చిన విశాఖ మార్గదర్శకాలు భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. అప్పటివరకు "లైంగిక వేధింపు" అనే పదానికి సరైన చట్టపరమైన నిర్వచనం లేదు.
         దీనిని గమనించిన సుప్రీంకోర్టు, చట్టం వచ్చే వరకు పాటించాల్సిన కొన్ని కఠినమైన నిబంధనలను రూపొందించింది. వీటినే "విశాఖ మార్గదర్శకాలు" అంటారు. ప్రతి ఆఫీసులో ఫిర్యాదుల కమిటీ ఉండాలని మొదటిసారి ఈ మార్గదర్శకాలే చెప్పాయి. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని స్పష్టం చేశాయి.
చట్టం రూపకల్పన (2013)
        విశాఖ మార్గదర్శకాలు వచ్చిన దాదాపు 16 ఏళ్ల తర్వాత, మహిళా సంఘాల నిరంతర ఒత్తిడి ఫలితంగా భారత ప్రభుత్వం "పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నిరోధక, నిషేధ, పరిష్కార) చట్టం - 2013" ని తీసుకువచ్చింది. దీనినే మనం ఇప్పుడు పోష్ (పిఓఎస్ హెచ్) చట్టం అని పిలుస్తున్నాం.
         ఒక సామాన్య మహిళ (భన్వరీ దేవి) తనపై జరిగిన దాడికి ఎదురుతిరిగి చేసిన పోరాటం, నేడు దేశంలోని కోట్లాది మంది మహిళా ఉద్యోగులకు రక్షణ కవచంగా మారింది.
        నేడు ఆమె వయస్సు సుమారు 60 ఏళ్లు పైబడి ఉంటుంది. ఆమెకు ఆశించిన స్థాయిలో వ్యక్తిగత న్యాయం జరగకపోయినా, ఆమె చేసిన పోరాటం వల్ల కోట్లాది మంది భారతీయ మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ లభించింది. ఆమె సాహసాన్ని గుర్తించి అంతర్జాతీయ మహిళా సదస్సులకు కూడా ఆమెను ఆహ్వానించారు.
        ఆమె చేసిన పోరాటం ఆధారంగా జగ్మోహన్ ముంద్రా  "బవందర్" అనే సినిమాను నిర్మించారు. దీని వల్ల భన్వరీ దేవి పోరాటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ కల్పించే పోష్ ( ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ) చట్టం, 2013 గురించి పూర్తి వివరాలు 
      ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పని చేసే చోట మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడం, ఒకవేళ వేధింపులు జరిగితే వాటిని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడం.
         శారీరక స్పర్శ లేదా అనుచితంగా తాకడం, లైంగిక కోరికలు తీర్చాలని డిమాండ్ చేయడం లేదా అడగడం, లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం, అశ్లీల చిత్రాలు, వీడియోలు లేదా సాహిత్యాన్ని చూపించడం, మహిళలకు అసౌకర్యం కలిగించే ఇతర అవాంఛనీయ ప్రవర్తనలు ఈ చట్టం ప్రకారం లైంగిక వేధింపులుగా పరిగణించబడతాయి.
అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)
పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి) ఉండటం తప్పనిసరి. ఈ కమిటీకి ఒక మహిళా ఉన్నతాధికారి అధ్యక్షత వహించాలి. కనీసం సగం మంది సభ్యులు మహిళలై ఉండాలి. బయటి వ్యక్తిగా ఒక స్వచ్ఛంద సంస్థ (ఎన్జిఓ ) ప్రతినిధి ఉండాలి. మహిళల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
        వేధింపులు జరిగిన తేదీ నుండి 3 నెలల లోపు బాధితురాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఒకవేళ బాధితురాలు ఫిర్యాదు చేయలేని స్థితిలో ఉంటే, ఆమె వారసులు లేదా ఆమె అనుమతితో సహోద్యోగులు ఫిర్యాదు చేయవచ్చు. 10 మంది కంటే తక్కువ మంది ఉన్న సంస్థలు లేదా అసంఘటిత రంగం (ఉదా: ఇళ్లలో పనిచేసేవారు) కోసం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్సిసి ) అందుబాటులో ఉంటుంది.
          విచారణ ప్రారంభించే ముందు బాధితురాలు కోరుకుంటే నిందితుడితో రాజీ కుదిర్చే అవకాశం ఉంటుంది (కానీ డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేయకూడదు). 90 రోజుల్లోపు విచారణ పూర్తి చేయాలి. బాధితురాలి పేరు, చిరునామా, విచారణ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టకూడదు. ఇది చాలా కఠినమైన నిబంధన.
        నేరం నిరూపితమైతే నిందితుడిపై సంస్థ తరపున క్రమశిక్షణ చర్యలు (హెచ్చరిక, ప్రమోషన్ ఆపడం, ఉద్యోగం నుండి తీసివేయడం) తీసుకోవచ్చు. బాధితురాలికి జరిగిన మానసిక వేదన, వైద్య ఖర్చుల నిమిత్తం నిందితుడి జీతం నుండి కొంత మొత్తాన్ని పరిహారంగా ఇప్పించవచ్చు.
      ఈ చట్టం కేవలం ఆఫీసు లోపల మాత్రమే కాదు, ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా సంస్థ ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యాలలో  వేధింపులు జరిగినా వర్తిస్తుంది. డిజిటల్ మీడియా లేదా వార్తా సంస్థలలో పనిచేసే వారికి కూడా ఈ కమిటీల ద్వారా ఫిర్యాదు చేసే పూర్తి హక్కు ఉంటుంది. ఒకవేళ మీ సంస్థలో ఇలాంటి కమిటీ లేకపోతే, నేరుగా పోలీస్ స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్ ద్వారా షీ-బాక్స్ (సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్) పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
       ప్రతి సంస్థలో ఫిర్యాదులను విచారించడానికి ఒక ప్రత్యేక కమిటీ ఉండాలని నిబంధన పెట్టారు. ఒకవేళ మీ సంస్థలో కమిటీ సరిగ్గా స్పందించకపోతే, మీరు నేరుగా కేంద్ర ప్రభుత్వ షీ-బాక్స్  ఆన్‌లైన్ ఫిర్యాదుల పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చు.

శ్యామ్ కాగిత 
మచిలీపట్నం 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...