మచిలీపట్నం:
పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని, పరీక్షలకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కృష్ణాజిల్లా డీఈవో యువి సుబ్బారావు తెలిపారు.
కృష్ణాజిల్లాలో మూడు డివిజన్లయిన మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు,డివిజన్ల లో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు, పరీక్షా నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో వారి ఇంటి వద్ద నుండి పరీక్షా కేంద్రం వరకు, తిరిగి పరీక్షా కేంద్రం నుండి ఇంటికి చేరడానికి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం చేయవచ్చని తెలిపారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశానుసారం
గత సంవత్సరము నవంబర్ చివర్లో ప్రారంభించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ సత్ఫలితాలు ఇస్తోందని, తన ప్రగాఢ విశ్వాసం అని డిఈఓ తెలిపారు. జిల్లాలో అన్ని డివిజన్ల లో ఈ వంద రోజుల్లో దాదాపు అన్ని పాఠశాలలను పర్యవేక్షించడం జరిగిందని గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మెరుగైన ఫలితాలు సాధిస్తామని సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు.వంద రోజులు యాక్షన్ ప్లాన్ వల్ల విద్యలో వెనుకబడ్డ విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగిందని, తద్వారా ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులుగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగస్వాములై అంకితభావంతో పని చేసినందుకు డీఈవో అభినందించారు. అలాగే జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు కూడా వంద రోజులు యాక్షన్ ప్లాన్ చిత్తశుద్ధితో అమలు జరిగేలాగా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్పూర్తితో జిల్లాను మెరుగైన ఫలితాలు సాధించే దిశగా జిల్లాగా నిలబెట్టాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
జిల్లాలో మచిలీపట్నం డివిజన్లో 173 పాఠశాలలు, గుడివాడ డివిజన్లో 118 పాఠశాలలు, ఉయ్యూరు డివిజన్లో 120 పాఠశాలలు మొత్తం జిల్లాలో 411 పాఠశాలలు పరీక్షా కేంద్రాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మచిలీపట్నం డివిజన్ నుండి 7,692 మంది రెగ్యులర్ విద్యార్థులు, 264 మంది ప్రైవేటు విద్యార్థులు మొత్తం 7,956 మంది పరీక్షకు హాజరవుతున్నట్లుగా తెలిపారు. ఈ డివిజన్లో 13 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గుడివాడ డివిజన్లో 118 పరీక్ష కేంద్రాల్లో 6,462 మంది రెగ్యులర్ విద్యార్థులు, 341 మంది ప్రైవేట్ విద్యార్థులు కలిపి మొత్తం 6,803 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లుగా తెలిపారు. ఈ డివిజన్లో తొమ్మిది స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు.
ఉయ్యూరు డివిజన్లో 120 పరీక్షా కేంద్రాలలో 7,142 మంది రెగ్యులర్ విద్యార్థులు, 331 మంది ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 7473 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లుగా తెలిపారు. ఈ డివిజన్లో 07 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. కృష్ణాజిల్లాలో మొత్తం 22,232 మంది విద్యార్థినీ విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరవుతున్నట్లుగా తెలియజేశారు.
జిల్లాలో మొత్తం 29 స్టోరేజ్ పాయింట్ల నుండి ప్రశ్నాపత్రాలు, గోప్యమైన సామాగ్రి పంపిణీ కోసం 10 రూట్లు గుర్తించి 20 మంది రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. 55 సి క్యాటగిరి సెంటర్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు.
205 మంది చీఫ్ సూపరింటెండెంట్ లను, 205 మంది డిపార్ట్మెంట్ అధికారులను, ఇంకనూ అదనపు చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించినట్లుగా తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల కొరకు 51 మంది అదనపు జాయింట్ కస్ట్టోడియన్ లని నియమించినట్లుగా తెలిపారు.1,562 మంది ఇన్విజిలేటర్లు పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
విద్య, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో 5 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఏ విధమైన కాపీయింగ్ చర్యలు చేపట్టకుండా ఇన్విజిలేటర్లు పారదర్శకంగా పనిచేయాలని, ఏదైనా కేంద్రంలో అనుకోని అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ఇన్విజిలేటరు పూర్తి బాధ్యత వహించాలన్నారు. సంబంధిత పాఠశాలలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా త్రాగునీటి వసతి ఏర్పాటు చేసినట్లు, ఆయా పరీక్షా కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను కూడా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను పరిశీలించడం జరుగుతుందని, ఆకస్మిక పర్యటనలు చేస్తానని తెలిపారు.
నిర్దేశించిన టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు 50 నిమిషాల ముందే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని డీఈవో అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అలజడులు అసాంఘిక సంఘటనలు జరగకుండా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేలాగా ఆయా సెంటర్ల సిబ్బంది పూర్తి బాధ్యత వహించి జిల్లాను మంచి స్థానంలో నిలబెట్టాలని సిబ్బందికి సుబ్బారావు సూచించారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా "పది" పరీక్షలు వ్రాయాలని వారికి శుభాభినందనలు తెలిపారు.
Comments
Post a Comment