మచిలీపట్నం:
పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు
సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తో కలసి రెండో విడతలో నగరంలోని రుద్రవరంలో 1089 మంది లబ్ధిదారులకు పీఎంఏవై... ఎన్టీఆర్ నగర్ టిడ్కో జి ప్లస్ త్రీ గృహాలను లాంఛనంగా ప్రారంభించి సంబంధిత పత్రాలను, నమూనా తాళం చెవులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమన్నారు.
అందులో భాగంగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండో విడతగా 2,50,893 గృహాలను లాంచనంగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తున్నారన్నారు. ఇది నిజంగా ఒక శుభదినం అని అన్నారు. ఆనాడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు వెంకయ్య నాయుడు సహకారంతో రాష్ట్రానికి 2లక్షల 50 వేల ఇల్లు మంజూరయ్యేలా కృషి చేశారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం షేర్వాల్ సాంకేతికతో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. అందులో భాగంగా మచిలీపట్నంలోని రుద్రవరంలో 6,400 ఇల్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అందుకు సంబంధించిన పనులు ప్రారంభించి దాదాపు పూర్తి చేశామన్నారు. ఎన్నికల తర్వాత ఆ పనులు పూర్తిగా ఆగిపోయాయన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. సొంతిల్లు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నట్లు తాము గమనించామన్నారు.
ఆ ప్రకారం రుద్రవరంలో 1,440 ఇల్లు పూర్తి చేశామన్నారు ఇప్పటివరకు 1089 మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారని వారికి నేడు ఇళ్ల తాళాలు అప్పగిస్తున్నామన్నారు. కొన్ని పునాది స్థాయిలో ఆగిపోయాయని, ఇంకా 1,800 ఇల్లు నిర్మించి పేదవారికి త్వరలో అందజేస్తామన్నారు. ఈ టిడ్కో గృహాల సముదాయంలో మురుగునీటి వ్యవస్థను, సెప్టిక్ ట్యాంకును, అంగన్వాడీ పాఠశాలను, కమ్యూనిటీ హాలును, షాపింగ్ కాంప్లెక్స్ ను, ప్రహరీని ఏర్పాటు చేయడంతో పాటు భద్రత కోసం గార్డును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం సి ఎస్ ఆర్ నిధులను కూడా వినియోగిస్తున్నామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే లబ్ధిదారులు నేరుగా తనను సంప్రదించాలని కోరారు
కొంతమంది లబ్ధిదారులు టిడ్కోగృహాల కోసం ఇదివరకు 20 నుంచి 30 వేల రూపాయలు చెల్లించారని, ఆ మొత్తాలను వారికి తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమిని ఇళ్లస్థలాలుగా కేటాయిస్తామన్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, అందులో భాగంగా ఇటీవల 1 లక్షా 50 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్సెలర్ మిటల్ స్టీల్ ప్లాంట్ ను త్వరలో పూర్తి చేసుకుంటున్నామన్నారు. బందరు ఓడరేవు నిర్మాణం 2026..27 సంవత్సరానికి పూర్తయి ఓడలు కూడా రానున్నాయన్నారు. తద్వారా ఓడరేవు ఆదారిత పరిశ్రమలు కూడా రానున్నాయని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తినడానికి ఆహారము, కట్టుకోవడానికి దుస్తులు, ఉండటానికి ఇల్లు చాలా అవసరం అన్నారు. ఈ టిడ్కో జి ప్లస్ త్రీ ఇళ్లను ప్రభుత్వం ఎంతో నాణ్యతతో, అత్యాధునిక షేర్వాల్ సాంకేతిక తో నిర్మించిందన్నారు. పేదల జీవితాల్లో మార్పు దిశగా ఒక ఆస్తి లభించినట్లు అయిందన్నారు. టిడ్కో ఇళ్లలో మూడు రకాల కేటగిరీలు ఉన్నాయని, 300 చదరపు అడుగుల ఫ్లాట్ విలువ 6.55 లక్షల రూపాయలు కాగా ఆ మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా భరిస్తూ ఉన్నాయన్నారు. లబ్ధిదారులకు కేవలం ఒక రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరుగుతుందన్నారు
అదేవిధంగా 365 చదరపు అడుగుల గృహాలకు సంబంధించి అయ్యే ఖర్చు 7 లక్ష 55 వేల రూపాయలలో
4.15 లక్షల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయని, లబ్ధిదారుని వాటా కింద 25 వేల రూపాయలు మిగిలిన 3.15 లక్షల రూపాయలను వాయిదాల రూపంలో బ్యాంకు రుణం చెల్లించాల్సి ఉందన్నారు.
అలాగే 430 చదరపు అడుగుల ప్లాట్ విలువ 8.55 లక్షల రూపాయలు అవుతుందని, 4.40 లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయని, లబ్ధిదారుడు తన వాటా కింద 50వేల రూపాయలు, 3.65 లక్షల రూపాయలు బ్యాంకు రుణం వాయిదాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
బ్యాంకు నుండి పొందిన రుణం సకాలంలో తిరిగి చెల్లించాలని ఆలస్యం చేస్తే వడ్డీ పెరిగిపోతుందన్నారు.
ముఖ్యంగా వాయిదా కంతుల కంటే కొంత ఎక్కువగానే పైకం చెల్లించినట్లయితే రాను రాను వడ్డీ తగ్గుతుందన్నారు.
రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ప్రతి పేదవానికి శాశ్వత గృహం నిర్మించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఇందులో భాగంగా మచిలీపట్నంలో గతంలోనే 6 వేల గృహాల నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందులో ప్రస్తుతం రుద్రవరంలో 1440 గృహాలు నిర్మించడం జరిగిందని, రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న 1089 మందికి ప్రస్తుతం గృహాలు అందజేయడం సంతోష దాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, మచిలీపట్నం నియోజకవర్గ ప్రత్యేక అధికారి మార్కెటింగ్ ఏడి నిత్యానందం, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, గృహ నిర్మాణ సంస్థ ఈఈ బుచ్చిబాబు, మునిసిపల్ డి ఈ నాగరాజు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ , మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ సమతాకీర్తి, స్థానిక నాయకులు వెంకటస్వామి, రమేషు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment