మచిలీపట్నం:
ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వాలంటీర్లకు సూచించారు.
మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి విద్యాశాఖ అధికారులు, గ్రామాల్లో గుర్తించిన వాలంటీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపుదలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో తాను పర్యటించినప్పుడు కొందరు పాఠశాల విద్యార్థుల్లో తెలుగు, ఆంగ్లం చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం లో వెనుకబడి ఉన్నట్లు గుర్తించానన్నారు. చాలాచోట్ల ఉన్నత పాఠశాలలను సందర్శించినప్పుడు విచారిస్తే చాలామంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లో సరిగా నేర్చుకో లేదంటున్నారన్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, హెచ్చింపులు బాగా నేర్పించాల్సి ఉందన్నారు. ఇది చాలా ముఖ్యమైన కనీస పునాది అని స్పష్టం చేశారు.
ప్రాథమిక పాఠశాలలో కొంతమంది విద్యార్థులు చదువులో వెనకబడి పోతున్నారనే విషయం ఉపాధ్యాయులు సరిగా గమనించడం లేదన్నారు.
ఇటీవల ప్రభుత్వం ఒక యాప్ ద్వారా ఎంతమంది విద్యార్థులు ఏ సామర్థ్యంలో ఉంటున్నారో వివరాలు తీసినప్పుడు దాంట్లో కొంతమంది విద్యార్థులు ఇంకా చదవడం రాలేదని, గణితంలో కూడికలు వస్తున్న తీసివేతలు రావడం లేదనే విషయం స్పష్టంగా తెలిసిందన్నారు.
గ్రామాల్లోని వాలంటీర్లు వారికి కేటాయించిన చదువులో వెనుకబడిన విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక్కొక్కరికి విడివిడిగా వారు చేస్తున్న తప్పులను గుర్తించి సరి చేస్తూ చదువు చెప్పాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఇఓ యువి సుబ్బారావు సర్వ శిక్ష ఎపిసి కుమిదిని సింగ్ , ఎంఈఓ లు ప్రధాన ఉపాధ్యాయులు, వాలంటీర్లు, చదువులో వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Post a Comment