స్వామివారికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పట్టు వస్త్రాల సమర్పణ
మచిలీపట్నం:
నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుండి వివిధ దేవాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా రామచంద్ర మూర్తిని దర్శించుకున్నారు. రుస్తుంబాదలో కొలువై ఉన్న శ్రీ భద్రాద్రి రామాలయ దేవస్థానాన్ని నగరంలోని వివిధ రామాలయాలని దర్శించుకుని తరించారు. రామాలయాలన్నీ విద్యుత్ దీప కాంతులతో అలరారుతున్నాయి. పలు దేవాలయాల్లో భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు కుటుంబ సమేతంగా రుస్తుంబాద భద్రాద్రి శ్రీ రామాలయంలో శ్రీరాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. శ్రీరామ కళ్యాణాన్ని తిలకించారు. దేవస్థాన ఈవో వై. శిరీష కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ ఓ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థాన చైర్మన్ శ్రీమంతు రాజా యార్లగడ్డ రామనాథ్ దేవి ప్రసాద్ దంపతులు, దేవస్థాన నిర్వహణ కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. స్వామివారి కళ్యాణ అనంతరం దాదాపు 5 వేల మందికి పైగా భక్తులకు దేవస్థాన ప్రాంగణంలో ఆలయ ఈ. ఓ. సారధ్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
స్థానిక రాబర్ట్ సన్ పేట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 101 మంది దంపతులు శ్రీరామ కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ దేసు నీరజ దంపతులు, నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో సమ్మెట ఆంజనేయస్వామి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పోలీసు రామాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాన్ని అందించారు. స్థానిక కోనేరు సెంటర్లో పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్, గొడుగు పేట, రాజుపేట, రామాలయం, జవార్ పేట, లక్ష్మీ టాకీస్ సెంటర్, రామానాయుడు పేట ,చిలకలపూడి గోడౌన్స్ వద్ద గల దేవాలయం, జిల్లా పరిషత్ సెంటర్, వలంద పాలెం తదితర దేవాలయాల్లో శ్రీరామ కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. నగరమంతా శ్రీ రామ నామస్మరణతో మారుమ్రోగింది.
Comments
Post a Comment