మచిలీపట్నం :
చట్టవ్యతిరేక జూద కార్యకలాపాలపై కృష్ణాజిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని కృష్ణాజిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడు తెలిపారు.133 మంది జూదానికి అలవాటు పడిన వారిని కొంతమంది నిర్వాహకులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.
జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటంతో బాటు ప్రజల ఆర్థిక, సామాజిక భద్రతను పరిరక్షించేందుకు కృష్ణాజిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్, పేకాట, కోడిపందాలు వంటి చట్టవ్యతిరేక జూద కార్యకలాపాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అన్ని సబ్ డివిజన్‌లు, సర్కిల్‌లు, పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అనుమానాస్పద ప్రాంతాలు, పూర్వ చరిత్ర కలిగిన బెట్టింగ్ నిర్వాహకుల కదలికలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న జూద కేంద్రాలపై నిఘా ఉంచారు.
జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, జూదానికి అలవాటు పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 133 మంది జూదానికి అలవాటు పడినవారు కొంతమంది నిర్వాహకులను అదుపులోకి తీసుకొని, వారిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం వారిపై బైండోవర్ చర్యలు తీసుకుని, కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించి విడుదల చేశారు.
క్రికెట్ బెట్టింగ్, పేకాట, కోడిపందాలు వంటి జూద కార్యకలాపాలు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. ఈ కార్యకలాపాలు ప్రజలను ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా నేరాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని, ఇకపై జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి చట్టవ్యతిరేక జూద కార్యకలాపాలు నిర్వహించినా, లేదా ప్రోత్సహించినా, వారు ఎంతటి వారైనా సరే ఎటువంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రజలు కూడా ఇటువంటి కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112 కు తెలియజేయాలని కోరారు.కృష్ణాజిల్లా పోలీసు యంత్రాంగం ప్రజల సహకారంతో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. త్వరలో గంజాయి, జూదం, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
Comments
Post a Comment