- జెవివి ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ సదస్సు
- దిశా నిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్సీ కెఎస్
మచిలీపట్నం:
భవిష్యత్ కు బంగారు బాట వేసుకునేందుకు విద్యార్ధులు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలని కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె. రాంజీ పేర్కొన్నారు. మంగళవారం కృష్ణా విశ్వవిద్యాలయం, జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యములో కెరీర్ గైడెన్స్, పోటీ పరీక్షలకు సన్నద్ధం పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో తరగతి గదిలో నేర్చుకునే పాఠాలతో పాటు వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంచుకుంటేనే అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి సామర్ధ్యాలు తెలుసుకుని ఆ మేరకు ప్రయత్నించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నారు. డిగ్రీ విద్యార్హత తో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తుచేసుకుని, ప్రణాళికా బద్ధంగా సిద్ధపడితే విజయం సాధించవచ్చన్నారు. జిల్లా స్థాయి పోస్టులు, మండల స్థాయి పోస్టులు సాధిస్తే పేద ప్రజలకు ఎంతో సేవచేయవచ్చన్నారు.
విశ్వవిద్యాలయ ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగం డైరెక్టర్ డాక్టర్ కిషోర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి. బసవేశ్వరరావు, ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగం సమన్వయకర్త ఆచార్య వైకె సుందరకృష్ణ, ఎస్ ఎఫ్ ఐ నేతలు రవి, పూజిత లు పాల్గొన్నారు.
Comments
Post a Comment