Skip to main content

సీఎం కార్యదర్శి మిశ్రా పై జిల్లా ప్రజల ఆగ్రహం


శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ 

 మచిలీపట్నం :

        కలెక్టర్ అంటే జిల్లాకు పెద్ద. ఎస్పీ అంటే జిల్లా పోలీస్ బాస్. కలెక్టర్ కావడం అంటే మామూలు విషయం కాదు. అందుకోసం దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష సివిల్స్ లో టాపర్గా నిలవాలి. ఈ పరీక్షలో విజయం సాధించడమంటే, వారు దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా కీర్తించబడతారు. సివిల్స్ కు ఎంపికైన వారు కేవలం వ్రాత పరీక్ష లో విజయం సాధిస్తే సరిపోదు, వారి యొక్క సమయస్ఫూర్తి, ఖచ్చితత్వం, చురుకుదనం, మాటతీరు, భావ వ్యక్తికరణ అన్నింటా వడపోసి మరీ సివిల్స్ అధికారిని ఎంపిక చేస్తారు. 

      దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్టు ఐఏఎస్(సివిల్స్ ).  ఐఏఎస్ అధికారికి ఎలాంటి షూ ధరించాలి, ఎలా ప్రవర్తించాలి అని చెప్పడమంటే... అలా చెప్పిన వారిని ఖచ్చితంగా ఒక దురహంకారపూరితమైన వ్యక్తి అని అనక తప్పదేమో! అలాంటి అమర్యాదపూర్వక చర్య ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా - కృష్ణా జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ, జిల్లా ఎస్పి వి వి విద్యాసాగర్ నాయుడు మధ్య చోటు చేసుకుంది. దాంతో ఒక ఐఏఎస్ అధికారితో మరో ఐఏఎస్ అధికారి అనుచితంగా వ్యవహరించడం తీవ్ర చర్చనీయంశమైంది. 

       కృష్ణా జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ, కృష్ణా జిల్లా ఎస్పి వి వి విద్యాసాగర్ నాయుడు పట్ల ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా అనుచితంగా వ్యవహరించినట్లు ఒక ప్రముఖ దిన పత్రిక వార్త ప్రచురించింది. 

పత్రికా కథనం ప్రకారం 

       ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర పర్యటన ముగిసిన అనంతరం అధికారులంతా గన్నవరం ఎయిర్పోర్టు లాంజ్ లో ఉండగా అక్కడికి సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా వచ్చారు. కృష్ణా కలెక్టర్ డీకి బాలాజీని పిలిచి... టై కట్టుకోవడమేమిటి? కోటు అలాగేనా వేసుకునేది, లేస్ ఉన్న షూస్ వేసుకోలేదంటూ మండిపడ్డారు. అనూహ్య ఘటనతో బాలాజీ ఒక్కసారిగా విస్తుపోయారు. అదేం లేదు సార్, అంటూ నవ్వుతూ సర్దుకుపోయే ప్రయత్నం చేశారు. ఏం నవ్వుతున్నావ్? తమాషాగా ఉందా? అంటూ మరింత గా మిశ్రా రెచ్చిపోయారు. ఆగకుండా ఐదారు నిమిషాల పాటు అందరూ వినేలా నోటికి పని చెప్పారు.

       అంతటితో శాంతించకుండా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడిని తన దగ్గరికి వచ్చాక సిదా ఖడో (సరిగ్గా నిల్చో) అంటూ హుకుం జారీ చేశారు. సర్, నేను సరిగ్గానే ఉన్నాను అని అంటుండగా ఏమిటి నోరు లేస్తోంది తమాషాలు చేయకు అని అరిచారు. హుందాగా వ్యవహరించవలసిన సీనియర్ అధికారి ఇష్టారీతిన వ్యవహరించడంతో అక్కడున్న అధికారులు విస్తు పోయారు.

        ఆయన అంతటితో ఊరుకోకుండా... కలెక్టర్ కు కొరియర్ లో' లేస్ ఉన్న బూట్లు పంపినట్లు తెలిసింది. ఈ వార్త కృష్ణా జిల్లా అధికార యంత్రాంగంతో పాటు, జిల్లా పోలీస్, జిల్లా ప్రజలను కోపోద్రిక్తుల్ని చేసింది. 

        సీఎం కార్యదర్శి అంటే స్కూల్ హెడ్మాస్టర్ అనుకుంటున్నారా? తన తోటి అధికారులు స్కూలు పిల్లలు అనుకుంటున్నారా?  ఐఏఎస్ అధికారి కి డ్రెస్ కోడ్ గురించి, షూ గురించి చెప్పడం, ఐపీఎస్ అధికారికి ఎలా నిలబడాలో చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అంటూ జిల్లా అధికారుల నుండి, జిల్లా ప్రజల నుండి తీవ్ర అసహనం, వ్యతిరేకత వినిపిస్తుంది.

డి కె బాలాజీ శైలి 

      సౌమ్యూడిగా, నిరాడంబరుడిగా, కష్టపడే అధికారిగా, వివాదరహితుడిగా పేరున్న బాలాజీ, తన విలక్షణమైన పనితీరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి చేత పలు సందర్భాలలో ప్రశంసలు పొందడమే కాకుండా బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు సైతం దక్కించుకున్నారు. గత సంవత్సరం ముసోలినీలో జరిగిన కలెక్టర్ల శిక్షణలో సైతం టాపర్ గా నిలిచారు. అవార్డులతో పాటు తన పనితీరుతో ప్రజల నుండి సైతం మెప్పు పొందుతూ ముందుకు సాగుతున్నారు.

       అలాగే యువ ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ సైతం తనదైన శైలిలో శాంతి భద్రతల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తూ జిల్లా ప్రజల మన్ననలు పొందుతున్నారు.

      అలాంటి అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి మిశ్రా  నిష్కారణంగా అవమానించడం తగదు.  జిల్లా కలెక్టర్ ను అవమానించడమంటే జిల్లా ప్రజలను అవమానించినట్లే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతుంది. దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి మిశ్రా పై శాఖాపరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. 

శ్యామ్ కాగిత 
మచిలీపట్నం 

 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...