Skip to main content

ఆంధ్రప్రదేశ్ రైతు నంబర్ వన్

 

            "రైతే రాజు - జై కిసాన్" అనేది మన దేశ మూలాలను ప్రతిబింబించే ఒక నినాదం. 

        మన దేశ జనాభాలో అత్యధికులు  వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. పండుగైనా, పబ్బమైనా రైతుకు విశ్రాంతి ఉండదు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ మన కోసం పంటను సాగు చేస్తాడు. రైతు ఎవరినీ అడగడు, తనే అందరికీ పెడతాడు. అందుకే రైతును "రాజు" అని పిలుచుకుంటాం.

          మనం రాజుగా భావించే రైతు నిజంగా రాజులానే ఉన్నాడా అంటే... ఖచ్చితంగా కాదు అనే సమాధానమే వస్తుంది. నేటి రైతు పెట్టుబడి సాయం నుంచి గిట్టుబాటు ధర వరకూ ఎన్నో వ్యయ ప్రయాసలను ఎదుర్కొని, రోజు రోజుకీ అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాడని గణాంకాలు చెబుతున్నాయి.

         ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఋణ భారంపై ఇటీవల లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం కీలక గణాంకాలను వెల్లడించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, దేశంలో అత్యధికంగా ఏపీ రైతులే అప్పుల ఊబిలో ఉన్నారని పేర్కొన్నారు.

కేంద్రం వెల్లడించిన గణాంకాలు 

          ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతు కుటుంబంపై సగటున ₹2,45,554 అప్పు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని మొత్తం రైతు కుటుంబాల్లో సుమారు 93.2% మంది అప్పుల్లో ఉన్నారని, ఇది దేశంలోనే అత్యధికమని వెల్లడించింది. ఈ అప్పుల గణాంకాల ప్రకారం దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

        2018-19వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రైతు రుణాలపై నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్ ), కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు అత్యంత చర్చనీయాంశమయ్యాయి. 

        2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రైతు కుటుంబంపై సగటున ₹2,45,554 అప్పు ఉన్నట్లు అప్పట్లో "సిట్యుయేషన్ అసెస్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్‌హోల్డ్స్" సర్వే పేర్కొంది.  ఈ కాలంలో ఏపీ రైతుల అప్పు జాతీయ సగటు (సుమారు ₹74,121) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. దీంతో దేశంలోనే అత్యధిక అప్పులున్న రైతుల్లో ఏపీ రైతులు మొదటి స్థానంలో నిలిచారు.

        దేశవ్యాప్తంగా ఒక రైతు కుటుంబం సగటు అప్పు ₹74,121 మాత్రమే ఉండగా, ఏపీలో ఇది జాతీయ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. మన పొరుగున తెలంగాణలో రైతు  సగటు అప్పు ₹1,52,113 గా ఉంది.

        కేంద్ర ప్రభుత్వం మరియు నాబార్డ్  అధ్యయనాల ప్రకారం ఈ పరిస్థితికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

పెట్టుబడి ఖర్చులు

       సాగు ఖర్చులు పెరగడం, ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించకపోవడం. కౌలు రైతులు ఎక్కువగా వడ్డీ వ్యాపారులపై ఆధారపడటంతో వారిపై వడ్డీ భారం అధికంగా ఉంటోంది. ఏపీలో బ్యాంకు రుణాల లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ, పాత బాకీలు పేరుకుపోవడం వల్ల కొత్త రుణాలు భారంగా మారుతున్నాయి.

      విత్తనాలు, ఎరువుల ధరలు పెరగడం వల్ల కొత్త అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. పాత అప్పులు తీరినప్పటికీ, కొత్తగా తీసుకున్న రుణాలపై వడ్డీ పెరగడంతో రైతుపై భారం పెరుగుతుంది.

 ఆదాయం మరియు ఖర్చుల నిష్పత్తి

          ఏపీ రైతు సగటు నెలసరి ఆదాయం సుమారు ₹10,480. ఈ ఆదాయంలో పంటల ద్వారా వచ్చేది తక్కువగా ఉండగా, కూలీ పనులు మరియు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం ప్రధానంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

అప్పుల వినియోగం 

        రైతులు తీసుకున్న రుణాలను దేనికోసం వాడుతున్నారనే దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. సుమారు 57.5% అప్పు సాగు పెట్టుబడుల (విత్తనాలు, ఎరువులు) కోసమే వాడుతున్నారు. మిగిలిన అప్పును ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్యం మరియు శుభకార్యాల కోసం వినియోగిస్తున్నారు

       దాదాపు 60% కంటే ఎక్కువ రుణాలు బ్యాంకులు లేదా సహకార సంఘాల నుండి తీసుకున్నవి. సుమారు 38% - 40% రుణాలు వడ్డీ వ్యాపారులు లేదా ఇతర ప్రైవేట్ వ్యక్తుల నుండి తీసుకున్నవి (ముఖ్యంగా కౌలు రైతులు). కౌలు రైతులకు రుణమాఫీ ప్రయోజనాలు అందకపోవడంతో వారు ప్రైవేట్ అప్పుల్లోనే ఉండిపోయారు

రాజకీయ దుమారం     

        ఈ గణాంకాలు పార్లమెంట్‌లో విడుదలైన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. గత ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని అధికార పక్షం, ప్రస్తుత పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రతిపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

       ఆంధ్రప్రదేశ్‌లో రైతుల అప్పులకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే, అప్పుల భారం క్రమంగా పెరుగుతూ వస్తోందని అర్థమవుతుంది. ముఖ్యంగా నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్), ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రం ఇచ్చిన నివేదికల ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి.       

సంవత్సరాల వారీగా ఏపీ రైతు సగటు అప్పు 

     2012-13వ ఆర్ధిక సంవత్సరంలో  ₹1,23,400 లుగా ఉన్న రైతు అప్పు 2014వ సంవత్సరం నుంచి అమాంతంగా పెరుగుతూ 2018-19 వ ఆర్ధిక సంవత్సరానికి దాదాపు వంద శాతం పెరిగి అంటే రెట్టింపై ₹2,42,489 కు చేరింది.

       2019నుండి 2024 వరకు రైతు ఋణ భారం దాదాపు అదేవిధంగా కొనసాగింది. 2024-25 వ ఆర్ధిక సంవత్సరానికి  ₹2,45,554 కు, 2025-26  వ ఆర్ధిక సంవత్సరానికి ₹2,51,000 (అంచనా)  చేరవచ్చని ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి. 

      రాష్ట్రం లో అత్యంత ప్రధానమైన వ్యవసాయ వృత్తి మీద ఆధారపడిన రైతులను, రైతు కుటుంబాలను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవలసి ఉంది. దాని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనుకూలంగా మరిన్ని రాయితీలు, పథకాలు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది.  

        ఆరుగాలం కష్టపడే రైతన్నకు ఆసరాగా నిలబడి ప్రభుత్వం ఎంతవరకు ఆదుకుంటుందో చూడాలి!!!!!


శ్యామ్ కాగిత 

మచిలీపట్నం 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...