Skip to main content

మానవ తప్పిదాలతో జరిగే రహదారి ప్రమాదాలను నివారించాలి -- జిల్లా కలెక్టర్


మచిలీపట్నం: 

మానవ తప్పిదాలతో జరిగే రహదారి ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, జాతీయ, రాష్ట్ర రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రమాదాలకు అవకాశం లేకుండా తక్షణం స్పందించి పరిష్కరించాలన్నారు. 
జాతీయ రహదారులపై విద్యుత్ దీపాలు పనిచేయకపోవడం పట్ల కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ సమస్యపై ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారుల తీరు మారడం లేదని, ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెలుగుతున్నవి, వెలగని విద్యుత్ దీపాల వివరాలను తక్షణమే సమర్పించాలని ఆదేశించారు.

విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై ఉన్న కాలినడక వంతెనలకు (ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్) రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలను కడుతున్నారని, దీనివల్ల అవి నేరాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసాలుగా మారుతాయని, వాటి తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు పనిచేయకపోతే కనుక, సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేరుస్తామని హెచ్చరించారు. అదేవిధంగా గ్రామాల నుంచి జాతీయ రహదారులకు కలిసే ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అటువంటి ప్రాంతాలను గుర్తించి అప్రోచ్ రహదారులకు స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

2025 డిసెంబర్ నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో మొత్తం 52 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, వాటిలో 32 మరణాలు, 31 మంది గాయాలపాలయ్యారని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.
సమావేశంలో జిల్లా రవాణా అధికారి ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాస్, భారత జాతీయ రహదారుల అధికార సంస్థ పిడి విద్యాసాగర్, జిల్లా ప్రజారవాణా అధికారి వెంకటేశ్వర్లు, రహదారులు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లోకేశ్వరరావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్ కుముదిని సింగ్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, రాష్ట్ర రహదారులు, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...