Skip to main content

విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలు – భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

మచిలీపట్నం: 

         విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలు అని, విద్యను మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని బోధించాలని, సంస్కారవంతమైన భారతీయులుగా తయారు చేయాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

         గురువారం ఉదయం భారత మాజీ ఉపరాష్ట్రపతి రుద్రవరంలోని కృష్ణా విశ్వ విద్యాలయంలో జరుగుతున్న కృష్ణ తరంగ్, అంతర కళాశాల యువజనోత్సవాలు –2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

           ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ విద్యాభ్యాసంతో పాటు ఉద్యోగాల భర్తీలో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని, ఆ దిశగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా, ప్రజల కోసం చేసే పరిపాలనలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఉత్తర ప్రత్యుత్తరాలలో పరిపాలన భాషగా తెలుగును ఉపయోగించాలని ఆకాంక్షించారు.
        మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని మరువకూడదని చెబుతూ, తెలుగువారుగా అందరూ మాతృభాష పట్ల మొదట ఆసక్తి పెంచుకోవాలని, తర్వాతే దేశంలోని హిందీ వంటి ఇతర భాషలు, ఆంగ్ల భాషను నేర్చుకోవాలన్నారు.

       అవసరం మేరకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, పరిమితికి మించి ఉపయోగిస్తూ బానిసలుగా మారి సమయాన్ని వృధా చేసుకోవద్దని, ఆ సమయాన్ని లక్ష్యసాధనకు నైపుణ్య అభివృద్ధి కోసం ఉపయోగించాలని విద్యార్థులకు హితువు పలికారు.

          చదువుతోపాటు పాఠ్యేతర కార్యకలాపాలు కళలు, క్రీడలకు సమయం కేటాయించాలని, అవి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. యువత దేశ సంపదని పేర్కొంటూ యువతలో తగిన సమయంలో స్ఫూర్తిని నింపి మార్గనిర్దేశం చేస్తే దేశానికి గొప్ప సంపదగా తయారవుతారని పేర్కొన్నారు. భారతదేశం త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ఆకాంక్షించారు.
             మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణా విశ్వవిద్యాలయం, జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబడిన విద్య సంస్థ అని పేర్కొంటూ విశ్వవిద్యాలయంలో కృష్ణ తరంగ్ అంతర కళాశాల యువజనోత్సవాలు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి, పోటీ తత్వాన్ని ప్రోత్సహించటం అభినందనీయమన్నారు.

        2014 నుంచి ప్రతి సంవత్సరం తాను యువ కెరటాలు కార్యక్రమం నిర్వహిస్తూ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

         భారత మాజీ ఉపరాష్ట్రపతి జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమని, ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి విద్యార్థి నాయకుడి నుంచి అంచలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా ఎదిగిన క్రమం ఎంతో గొప్ప విషయం అని పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడే తీరు ఎంతో హుందాతనంగా ఉంటుందని, అది నేటి రాజకీయవేత్తలు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

           ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాతృభాష తెలుగులోనే పాలనాపర ప్రత్యుత్తరాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ ఉపరాష్ట్రపతితో తనకు ఉన్న నాటి రాజకీయ అనుబంధాలను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.

         అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చేసిన కృషి, జిల్లా చరిత్ర, తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు.

           ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి కూన ప్రొఫెసర్ రాంజీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష, విశ్వవిద్యాలయం రెక్టర్ బసవేశ్వరరావు, ప్రోగ్రా కన్వీనర్ దిలీప్, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) ఛైర్మన్‌ బండి రామకృష్ణ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ జెడ్పిటిసి లంకే నారాయణ ప్రసాద్, పీవీ గజేంద్రరావు, సోడిశెట్టి బాలాజీ తదితర కూటమి నాయకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...