మర్రివాడ (పమిడిముక్కల):
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పమిడిముక్కల మండలం, మర్రివాడ గ్రామం ప్రధాన రహదారిపై ఆరబెట్టిన ధాన్యపు రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యపు గింజలను స్వయంగా చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వర్షాల వల్ల పంటకు మానుగాయ తెగులు సోకి గింజ రంగు మారిపోవడం వల్ల ఎవరూ కొనుగోలు చేయడంలేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కోత ఎప్పుడు కోశారు, ప్రస్తుతం తేమశాతం ఎంత ఉందని కలెక్టర్ రైతును ఆరా తీయగా, శనివారం నాడు కోత కోసి ఆరబెట్టానని, ప్రస్తుతం తేమశాతం పరీక్షించగా 23 ఉందని రైతు సమాధానం ఇచ్చారు. జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల పట్ల ఆందోళన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలన్నారు. గత సంవత్సరం కంటే అదనంగా 30 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచామని, అయితే వాతావరణ పరిస్థితుల ఆందోళనతో రైతులు యంత్రాలతో ఒకేసారి పెద్ద మొత్తంలో కోతలు కోయడం వల్ల పెద్ద మొత్తంలో సంచులకు డిమాండ్ పెరిగిందన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందవద్దని సంచులను సమృద్ధిగా అందుబాటులో ఉంచుతున్నామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.
అధికారులు టార్పాలిన్లు కొంతమందికే ఇచ్చారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అవసరమైన రైతులందరికీ వెంటనే అందించాలని సూచించారు.
Comments
Post a Comment