శ్యామ్ కాగిత, మచిలీపట్నం:
ఈనెల 5వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెగా తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల (పేరెంట్ టీచర్స్) సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో మెగా తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశంపై నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మూడవసారి మెగా పేరెంట్ - టీచర్స్ సమావేశం నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశం తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య వారధి లాగా పనిచేస్తుందన్నారు
ఈ సమావేశం ద్వారా విద్యార్థుల విద్యా పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేసే అవకాశం లభిస్తుంది.
దాంతో తల్లిదండ్రుల సహకారం కూడా పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లల హోలిస్టిక్ పురోగతి కార్డులను అందజేస్తామని అందులో ఏ విద్యార్థి ఏ ఏ స్థాయిలో ఉన్నారో వారికి తెలుస్తుంది అన్నారు. ఏమి చేస్తే ఆ విద్యార్థి తదుపరి స్థాయికి వెళతారో ఆ విషయమై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు.
అంతేకాకుండా ఈసారి వినూత్నంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎఫ్ఎల్ఎం అనే పేరుతో బేస్ లైన్ పరీక్షలు నిర్వహించి వారు ఏ ఏ స్థాయిలో ఉన్నారో వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపరిచి రాబోయే తల్లిదండ్రుల - ఉపాధ్యాయుల సమావేశానికి తల్లిదండ్రులకు నివేదిక అందజేస్తామన్నారు.
ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పకుండా ఈ సమావేశంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి పి వి జె రామారావు పాల్గొన్నారు
Comments
Post a Comment