మచిలీపట్నం :
మచిలీపట్నం నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో పలు రహదారుల అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం మంత్రివర్యులు నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ - ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ నెల 9, 10 తేదీలలో రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు మచిలీపట్నం నియోజకవర్గం రానున్నారన్నారు. వారి సమక్షంలో నియోజకవర్గంలో చిన్నాపురం, కోన, కమ్మవారిపాలెం, తాళ్లపాలెం తదితర ప్రాంతాల్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించుటకు అన్ని విధాల కృషి చేస్తుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.
నిన్నటి శుక్రవారం రోజున మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం ఉండడంతో శనివారం నిర్వహిస్తున్నామన్నారు
నియోజకవర్గంలో సంవత్సరన్నర కాలంలో దాదాపు 2,264 అర్జీలు వచ్చాయని వాటన్నిటిని దాదాపు పరిష్కరించడం జరిగిందన్నారు. అలాగే ఆన్లైన్లో 208 అర్జీలు రాగా వాటిని కూడా దాదాపు పరిష్కరించడం జరిగిందన్నారు
పరిష్కారం కానివి మరలా తెరచి డాష్ బోర్డులో ఉంచి తగిన చర్యల కోసం సంబంధిత అధికారులకు ప్రజలకు మెరుగైన పరిష్కారం లభించేలా చూస్తున్నామన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి ఎక్కువగా అర్జీలు వస్తున్నాయన్నారు చాలామంది టిడ్కో గృహాలు కావాలని కోరుతున్నారన్నారు. జి ప్లస్ త్రీ గృహాలు పేదవారికి ఉపయోగపడే చాలా మంచి పథకం అన్నారు. ఇప్పటికే కొంతమందికి ఆ గృహాల అవకాశం కల్పించామని అన్నారు.
నియోజకవర్గం లో 6 వేల గృహాలు ఉన్నాయని పునాది స్థాయిలో నిలబడిన వాటిపై జీవన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని, అందులో 4 నుంచి 5 వేల గృహాలు త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని గతంలో తమ గోడు వినే నాథుడు లేరని, తాను గాని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను మంజూరు చేస్తామని సంవత్సరానికి 35వేల కోట్ల రూపాయలు పింఛన్ల కింద 64 లక్షల మందికి అందిస్తున్నామని, అర్హుల పింఛన్లు తొలగించరని స్పష్టం చేస్తూ వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా కొత్తవారికి ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారికి, దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయాల్సి ఉందని ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు.
మెగా పేరెంట్ టీచర్ సమావేశం ప్రతిష్టాత్మక కార్యక్రమమని, నూటికి నూరు శాతం విజయవంతం అయిందన్నారు. దీనివలన విద్యార్థుల స్థితిగతులను, భవిష్యత్తు తీర్చిదిద్దుటకు పాఠశాల మౌలిక వసతులు తెలుసుకునేందుకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నామని రైతులతో చర్చించామని రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా మిల్లర్లకు ధాన్యం తోలిన 24 గంటల్లోనే రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు.
నియోజకవర్గం జిల్లా రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. మచిలీపట్నం నుండి రేపల్లె మీదుగా దక్షిణ భారతదేశం కలుపుతూ రైల్వే మార్గం సుగమమయ్యిందని కేంద్ర మంత్రితో మాట్లాడామని ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా తయారైందన్నారు. త్వరలో పార్లమెంటులో కూడా ఆమోదించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అనిత, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణి కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు వెంకటస్వామి, ఇలియాస్ భాష పలువురు అర్జీదారులు పాల్గొన్నారు
Comments
Post a Comment