Skip to main content

బాలాజీ ఐఏఎస్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఒక ప్రేరణ


          కన్నడ బాషా ఉదయ టీవీలో యాంకర్ అడిగిన ప్రశ్న.... ప్రపంచంలో మొట్టమొదటిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏది? ఎటువంటి తడబాటు లేకుండా స్పష్టంగా న్యూజిలాండ్ అని ఠక్కున సమాధానం వచ్చింది టీవీ చూస్తున్న ఐదవ తరగతి చదువుతున్న తొమ్మిది సంవత్సరాల చురుకైన కుర్రాడి దగ్గర నుంచి. కర్ణాటక గ్రామీణ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న తండ్రి పక్కనే ఉన్న కుర్రవాడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని అభినందించాడు. 

         కొన్ని నిమిషాల ముందు అల్లరి చేస్తున్నాడని మందలించిన తండ్రి అభినందించడంతో ' బాగా చదివితే ఎవరూ ఏమీ అనరు' అందరు ప్రేమగా చూస్తారు అని ఆ కుర్రాడి మనసులో బలంగా నాటుకుంది. 

        జనరల్ నాలెడ్జ్ పుస్తకాలే కాకుండా అకడమిక్ పుస్తకాలు కూడా చదివితే గొప్పవారు కావచ్చు అని అనుకొని పట్టుదలతో నిరంతరం ఆ ఆలోచనలతో ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడుతున్నా అందరినీ ఒక్కటే అడిగేవాడు. "దేశంలో జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండే పరీక్ష ఏది"? "ఆ పరీక్ష రాస్తాను". అందరూ ఐఏఎస్ అని చెప్పేవారు. దీనికి తోడు స్వగ్రామానికి చెందిన జగదీష్ అనే యువకుడు 2005లో ఐఏఎస్ లో 58వ ర్యాంకు సాధించాడు. ఈ సంఘటన కూడా మనసులో బాగా నాటుకు పోయింది. 

         ఎంత కష్టమొచ్చినా ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో పుస్తకాలు బాగా చదవడం మొదలుపెట్టాడు. నోట్స్ రాసుకోవడం, చదివింది మననం చేసుకోవడం ఇదే అతని దినచర్య అయ్యింది.  

        స్వస్థలం కర్ణాటక రాష్ట్రం తమ్మకూరు జిల్లా తాలూకా హెడ్ క్వార్టర్ కొరటగిరి గ్రామం ప్రభుత్వ హైస్కూల్లో పదవ తరగతి వరకు పూర్తి చేసి; తమకూరు జిల్లా సిద్ధం ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇన్ సోషియాలజీ చదివాడు. బెంగళూరులోని బెంగళూరు యూనివర్సిటీ ఆర్ వి కళాశాలలో బిబిఏ, ఎంబీఏ పట్టా పొందాడు. 

        బెంగళూరులో ఐఏఎస్ కు కోచింగ్ తీసుకుని అవిశ్రాంతంగా, ప్రణాళికాబద్ధంగా చదువుతూ రెండో ప్రయత్నంలో కన్నడ లిటరేచర్ సబ్జెక్టుగా 2014 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ఆల్ ఇండియా 36 వ ర్యాంక్ సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేధించాడు.
      కలలు అందరూ కంటారు, కానీ ఆ కలను నిజం చేసుకోవటానికి నిరంతరం శ్రమించేవారు కొందరే ఉంటారు. అలా చిన్నతనం నుంచి తను కన్న కలను ఖచ్చితమైన ప్రణాళికతో నిజం చేసుకోగలిగిన ఆ కుర్రాడే ప్రస్తుత కృష్ణాజిల్లా కలెక్టర్ దసలుకుంటే కృష్ణయ్య శెట్టి బాలాజీ (డీకే బాలాజీ) 

        ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2015-బ్యాచ్ IAS అధికారి డీకే బాలాజీ కృష్ణా జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, విశాఖపట్నం జిల్లాలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు.
              
         కర్నూలు కార్పొరేషన్ కమిషనర్‌గా 25,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించడం, కర్నూలు నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌ను మెరుగుపరచడం, కర్నూలు నగరంలో COVID-19 మహమ్మారిని విజయవంతంగా కట్టడి చేయడం మరియు ఏడు థీమ్ పార్కుల అభివృద్ధికి సహకరించడం వంటి వివిధ కార్యక్రమాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. 

        జిల్లా కలెక్టర్ గా మొట్టమొదటి పోస్టింగ్ కృష్ణాజిల్లా. మొదటిసారిగా ఐఏఎస్ ట్రైనింగ్ కృష్ణాజిల్లా కాగా, ఇప్పుడు జిల్లా కలెక్టర్గా కృష్ణా జిల్లాకు రావడం తన అదృష్టం అంటారు డీకే. తాను కృష్ణాజిల్లా కలెక్టర్ గా ఉన్నంతవరకు మచిలీపట్నం తో పాటు కృష్ణాజిల్లాలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నానని బాలాజీ చెప్పారు. 
       మచిలీపట్నం నగరం మరియు కృష్ణాజిల్లా పై మంచి అవగాహన కలిగిన బాలాజీ, నగర డ్రైనేజీ వ్యవస్థ కై 13 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకోవడంతో పాటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు, గ్రామీణ ప్రాంత అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఒప్పించి మెప్పించగలిగారు.
 
         మాతృబాష కన్నడ అయినా తాను చెప్పాలనుకున్న విషయాన్ని తెలుగులో స్పష్టంగా వీడియో రూపంలో జిల్లా ప్రజలకు అర్ధమయ్యేలా చేరువ చేయడం ఆయన శైలి. తన విలక్షణమైన వ్యక్తిత్వంతో తాను పనిచేస్తూ, జిల్లా యంత్రాంగం తో పని చేయించడం ఆయన ప్రత్యేకం. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను అలుపెరుగక మంత్రులు, శాసనసభ సభ్యుల సహకారంతో అధికారులు, సిబ్బందితో ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తున్నారు. 
         2024 సంవత్సరంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా, మచిలీపట్నం యానాదుల కాలనీలో ఆధార్ కార్డులు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోతున్న యానాదులపై డికె ప్రత్యేక శ్రద్ధ వహించి గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో యానాదులకు ఆధార్ కార్డులు పొందేలా చర్యలు తీసుకున్నారు.

         జిల్లా పాఠశాలల్లో "నాకు సాధ్యమే" అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల శ్రేయస్సు కోసం సృజనాత్మకంగా కృషి చేస్తున్నారు. కలెక్టర్ భవనాన్ని వదిలి సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మధ్య లో తన పుట్టినరోజు జరుపుకునే నిరాడంబరత బాలాజీ సొంతం. ప్రతి నెలా 3వ శుక్రవారం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉద్యోగుల ఫిర్యాదుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వారి సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. ప్రతి శనివారం కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కాలుష్య రహిత దినోత్సవాన్ని అమలు చేయటంతో పాటు స్వయంగా సైకిల్‌పై కలెక్టర్ కార్యాలయానికి వస్తూ కలెక్టరేట్ సిబ్బంది కి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

         2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో కృష్ణా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారిగా అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ డికె బాలాజీని బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఎంపిక చేసింది. 

          బాలాజీ "ఎథిక్స్ ఇంటిగ్రిటీ ఆప్టిట్యూడ్" అనే పుస్తకాన్ని రచించారు. ఇది సివిల్ సర్వీస్ కు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఏఎస్ సాధించిన బాలాజీ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వారి లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రేరణగా నిలుస్తున్నారు.

శ్యామ్ కాగిత,
మచిలీపట్నం
 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...