మచిలీపట్నం:
పన్నులు సకాలంలో చెల్లించి మచిలీపట్నం నగర అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక పాలన అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.
గురువారం మధ్యాహ్నం నగరంలోని మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగరపాలక సంస్థ ప్రత్యేక పరిపాలన అధికారిగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, రెవిన్యూ అధికారి వెంకటేశ్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మార్చి మాసంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ వారికి సంబంధించిన పన్నులను అన్నిటినీ చెల్లించి నగరపాల సంస్థకు సహకరించాలన్నారు. ఆ విధంగా చెల్లించిన పన్నులతో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు వీలవుతుందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని కోరారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి నగరపాలక సంస్థ సిబ్బందికి అందజేయాలన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ఎల్ ఆర్ ఎస్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అనధికార లేఔట్లలో స్థలం కొనుగోలు చేసి ఉంటే వాటిని నగరపాలక సంస్థలో క్రమబద్ధీకరణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆ విధంగా చేయడం వలన వారికి భవిష్యత్తులో బ్యాంకు రుణాలు సజావుగా పొందే అవకాశం ఉంటుందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి నగరంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు, పరిసరాల పరిశుభ్రత, పన్నుల వసూళ్లు తదితర కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, పలువురు నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment