Skip to main content

అధికార పార్టీ జనసేన తన పంతం నెగ్గించుకుంది... కానీ!?


          సముద్ర తీరంలో ఉన్న మచిలీపట్నం ప్రశాంతతకు పెట్టింది పేరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.... నగరం దాదాపు ప్రశాంతంగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో ఘర్షణలు జరిగినా ఎన్నికల అనంతరం పార్టీల సైద్ధాంతిక  వైరమే గాని వ్యక్తిగత వైరాలు కనిపించవు.  కానీ 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నగర రాజకీయాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ తీరు పలు సందర్భాల్లో  వివాదాస్పదమవుతూ వార్తల్లో నిలుస్తుంది.
         మచిలీపట్నంలో జనసేన బహు నాయకత్వంలో ఉంది. నాయకులు ఎవరికి వారే పార్టీకి అంతా మేమే అనే ధోరణితో  వ్యవహరిస్తూ ఉంటారు. వారిలో వారే గొడవపడి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న  సందర్భం కూడా లేకపోలేదు.
           2024 కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం జనసేన నాయకులు నగరంలో పలు సందర్భాలలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతూ వస్తున్నారు.  ముఖ్యంగా ఫలితాల అనంతరం  విద్యుత్ శాఖ అధికారిపై కొంతమంది జనసేన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. సోషల్ మీడియా పోస్ట్ వివాదంలో ఆ అధికారితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బలవంతంగా క్షమాపణ చెప్పించి, పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేయించారు.
        అలాగే బందరు మండలం  మోడీ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ పవన్ కళ్యాణ్ ను విమర్శించాడని, ఆయన ఇంటి పై జనసేన నాయకులు, కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడి చేసి, డాక్టర్ ను మోకాళ్లపై కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ కు  క్షమాపణ చెప్పించారు.
       పోలీసు హోంగార్డు లేచి తనకు నమస్కారం చేయలేదని.. జనసేన నాయకుడు ఆ హోంగార్డుపై దాడి చేసి  గాయపరిచాడు అనే ఆరోపణలతో, సదరు జనసేన నాయకుడు అరెస్టు అయ్యాడు. తదనంతర పరిణామాలతో ఆ నాయకుడిని  జనసేన  పార్టీ సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లుగా పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ ప్రకటించారు.
      గురువారం సాయంత్రం రామానాయుడుపేట సెంటర్లో జెండా దిమ్మ విషయంలో వివాదం చెలరేగింది. జనసేన నాయకుడు సెంటర్లో జెండా దిమ్మ కట్టడానికి ప్రయత్నం చేస్తుండగా వైసీపీ నాయకులు ఇక్కడ కట్టడానికి వీలు లేదని అడ్డు పడ్డారు.  మృదుస్వభావి, వివాదరహితుడు అయిన మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ సైతం తన పంథాను వీడి, ఘర్షణలో పాల్గొని  మేము దేనికైనా సిద్ధం అని ప్రకటించడం మచిలీపట్నం ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఆ సందర్భంలో పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలతో సస్పెండ్ అయిన నాయకుడు బండి రామకృష్ణ వెనకవైపునే ఉండి రామకృష్ణకి జై కొట్టడం చూస్తే పార్టీలో ఏ స్థాయి క్రమశిక్షణ ఉందో ఇట్టే  అర్థమవుతుంది.  
       శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామానాయుడుపేట సెంటర్లో పదుల సంఖ్యలో పోలీసులను మోహరించి, సెక్షన్ 30 అమలులో ఉన్నా,  మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలసౌరి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి జెండా ఎగురవేసి తమ పంతం  నెగ్గించుకున్నారు.        
https://youtu.be/wl7FmLTLZLY?si=7NLVgclR_RbXko-5
          ప్రతిపక్షం లో ఉండటానికి అధికారపక్షంలో ఉండటానికి చాలా తేడా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని ఎంతో బాధ్యతగా ఉండాలి. ప్రజా సంక్షేమం కోసం పాటుపడవలసిన జనసేన నేతలు...  వారి నాయకుని విమర్శించిన వారి మీద దాడి చేయడానికి, విమర్శకుల ఇళ్లలో వస్తువులను ధ్వంసం చేయడానికి, పార్టీ జెండా దిమ్మలు కట్టడానికి అధికారాన్ని ఉపయోగించటం శోచనీయం.
          నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు వారి వారి గుర్తింపు కోసం క్రమశిక్షణను మరచి ఇష్టారీతిలో వ్యవహరించడం జనసేన పార్టీని తీవ్ర విమర్శలకు గురిచేస్తుంది. కూటమి పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న జనసేన తన మెరుగైన సేవలతో ప్రజలకు మరింత చేరువ కావడం మరచి తరచుగా ఇలా వివాదాల్లో ఉండటం నగరంలో చర్చనీయాంశం అవుతుంది.
        
శ్యామ్ కాగిత 
మచిలీపట్నం 
 
 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...