Skip to main content

రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి –– జిల్లా కలెక్టర్



మచిలీపట్నం: 

అధిక ఆదాయం తెచ్చిపెట్టే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులతో (వీఏఏ) ప్రకృతి వ్యవసాయ సాగుపై మాట్లాడి జిల్లాలోని రైతులను ఆ దిశగా ప్రోత్సహించడంపై వారికి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ రూపంలో విత్తనాలు, రసాయనిక ఎరువులు సరఫరా చేయడంతో పాటు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ స్వల్ప ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. పెట్టుబడి వ్యయం పెరిగిపోయి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని, వారిని మంచి లాభాలు పొందే దిశగా నడిపించేందుకు ప్రకృతి వ్యవసాయం సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. దీనికోసం రైతు సేవ కేంద్రాల పరిధిలో రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల తాను గూడూరు మండలం పినగూడూరులంక గ్రామంలో సౌభాగ్య ఆహార అడవి నమూనాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అభ్యుదయ రైతు విజయరామ్ సాగు చేస్తున్న పంటలను పరిశీలించిన సందర్భాన్ని వివరిస్తూ, ఆసక్తి గల రైతులు ఆ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి గల రైతులకు సాగుపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అలాంటి వారిని గుర్తించాలని సూచించారు. రసాయనిక ఎరువులతో పండించే పంటలతో మానవుల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలను వివరించాలని, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో పరిస్థితులను తట్టుకొని నిలబడే ప్రకృతి వ్యవసాయ పంటల సాగులో వ్యత్యాసాన్ని రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు.

ఈ క్రమంలో అభ్యుదయ రైతు విజయరామ్ ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను, సాగు అనుభవాలను అధికారులు, వీఏఏలతో పంచుకున్నారు. వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించాలని, సాగు పట్ల ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తానని ఆయన తెలిపారు. 

కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఎన్ పద్మావతి, జె జ్యోతి, ఏపీ ప్రకృతి వ్యవసాయ డిపిఎం పార్థసారథి, డ్వామా పీడీ ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్, ఏడి మణిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...