ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలో భోజనం నాణ్యత పరిశీలన..
కృత్తివెన్ను/బంటుమిల్లి/పెడన:
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ మంగళవారం కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ ఆహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తొలుత ఆయన కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో రేషన్ షాప్, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అనంతరం సంగమూడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనాన్ని రుచి చూశారు. అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి పాఠశాలలో భోజనం బాగుంటుందా లేదా అని విద్యార్థులను అడిగి ఆహార నాణ్యతపై వారి అభిప్రాయాలను రాసి ఇవ్వాలని కోరగా పలువురు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తదితర అంశాలపై తమ అభిప్రాయాలను రాసి ఆయనకు అందించారు. పిల్లలకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, దీనిపై విద్యార్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు.
పాఠశాలలో ఎక్కడైనా భోజనం బాగోకపోతే 9963985678 ఫోన్ నంబరుకు కాల్ చేసి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. బల్లిపర్రు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో, స్టాక్ లో వ్యత్యాసం ఉండటం గుర్తించిన ఆయన దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులను హెచ్చరించారు.
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి జి మోహన్ రావు, విద్య, ఐసిడిఎస్, ఎస్సీ ఎస్టీ బీసీ తదితర శాఖల అధికారులు ఉన్నారు.
Comments
Post a Comment